జహీరాబాద్ నుంచి త్రిపురకు వాహనాల రవాణా

November 26, 2020
img

ఎక్కడ జహీరాబాద్...ఎక్కడ త్రిపుర రాష్ట్రంలోయి జిరానియా? రైల్వేమార్గంలోనైతే 3,600 కిమీ. అదే రోడ్డు మార్గమైతే మరో 5-600 కిమీలు కలుపుకోవలసిందే. అంత దూరంలో ఉన్న గమ్యానికి జహీరాబాద్‌లో తయారవుతున్న మినీ ట్రక్కులు, గూడ్స్ ఆటోలను పంపించాలంటే ఎంత కష్టం? అలాగని పంపించలేకపోతే నష్టపోయేది ఉత్పత్తిదారులే.  

లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోతున్న రైల్వేశాఖ ఆ నష్టాలను భర్తీ చేసుకోవడానికి సరుకురవాణాపై దృష్టి పెట్టి ప్రత్యేకంగా బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్లను ఏర్పాటు చేసుకొంది. దక్షిణమద్య రైల్వేలోని ఆ విభాగం జహీరాబాద్‌లో వాహన ఉత్పత్తిదారులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను తమకు ఓ గొప్ప వ్యాపార అవకాశంగా గుర్తించి, ఆ వాహనాలను 2,500 కి.మీ దూరంలో ఉన్న అస్సాంలోని ఛాంగ్సరీకి, 3,600 కిమీ దూరంలో ఉన్న త్రిపురలోని జిరానియాకు చేర్చేందుకు నడుం బిగించి చకచకా ఏర్పాట్లు చేసింది.

ముందుగా జహీరాబాద్‌ రైల్వేస్టేషన్‌లో వాహనాల లోడింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూనే, వాహనాల రవాణాకు ప్రత్యేకంగా బోగీలు సిద్దం చేసుకొంది. తెలంగాణ నుంచి అసోం, త్రిపుర రాష్ట్రాలకు వాటిని రవాణా చేసేందుకు వీలుగా రైల్వేశాఖలోని వివిద డివిజన్లను సమన్వయపరుచుకొంది. వాటి రవాణాకు అన్ని అనుమతులు సిద్దం చేసుకొని ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి ఇప్పటివరకు మొత్తం 69 మినీ ట్రక్కులు, 15 గూడ్స్ ఆటోలను తరలించి దక్షిణమద్య రైల్వే సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. వాటిలో 69 మినీ ట్రక్కులు త్రిపురకు, 15 గూడ్స్ ఆటోలను అసోంలోని చాంగర్సీకి రవాణా చేసింది.

దీంతో జహీరాబాద్‌లోని ఆటోపరిశ్రమల యజమాన్యాలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇదివరకు తాము తయారుచేసిన సరుకు రవాణా వాహనాలను రోడ్డు మార్గం ద్వారా తరలించేవారిమని, అది చాలా శ్రమ, ఖర్చు, రిస్క్‌తో కూడుకొన్న వ్యవహారం కావడంతో చాలా ఆందోళన చెందేవారిమని, కానీ ఇప్పుడు పట్టణంలోనే వాటిని రైల్వేశాఖకు అప్పగిస్తే చాలా నిశ్చింతగా ఉందని అన్నారు. ఆ వాహనాలను తమ కళ్ళముందే రైల్వేర్యాక్స్ లో లోడ్ చేసి సురక్షితంగా దూరప్రాంతాలకు తరలించి అక్కడ తమ వినియోగదారులకు దక్షిణమద్య రైల్వే అందజేస్తుండటం తమకు చాలా సంతోషం కలిగిస్తోందని అన్నారు.

దక్షిణమద్య రైల్వే కూడా ఇదే స్పూర్తితో రాష్ట్రంలోని ఫార్మా, ఆటోమోబైల్, టెక్స్‌టైల్‌ తదితర పరిశ్రమల ఉత్పత్తులను కూడా ఇతర రాష్ట్రాలకు రవాణా చేసి భారీగా ఆదాయం సమకూర్చుకొనేందుకు సిద్దం అవుతోంది.

Related Post