హైదరాబాద్‌ మెట్రో పండుగ రాయితీలు

October 16, 2020
img

లాక్‌డౌన్‌ కారణంగా సుమారు 6 నెలలు నిలిచిపోయిన హైదరాబాద్‌ మెట్రో సర్వీసులు మళ్ళీ సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. మెట్రో స్టేషన్లలో, మెట్రో రైళ్ళలో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ రైళ్లు నడిపిస్తున్నప్పటికీ కరోనా భయంతో ఇదివరకులా ప్రజలు మెట్రోలో ప్రయాణించేందుకు మొగ్గు చూపడం లేదు. ఒకవేళ ప్రయాణించాలనుకొన్నా మెట్రో రైళ్ళలో కూడా భౌతికదూరం పాటించవలసివస్తుండటంతో ఎక్కువమందిని అనుమతించలేని దుస్థితి నెలకొంది.  మెట్రో స్టేషన్లను, మెట్రో రైళ్ళను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయవలసిరావడం కొత్త కష్టంగా మారింది. కనుక ప్రస్తుత పరిస్థితులలో మెట్రో నిర్వహణ తలకు మించిన భారంగానే ఉందని చెప్పక తప్పదు. ప్రయాణికులను ఆకర్షించి ఈ సమస్యల నుంచి గట్టెక్కేందుకు తొలిసారిగా మెట్రో సంస్థ బతుకమ్మ, దసరా దీపావళి పండుగ ఆఫర్లను ప్రకటించింది.  

మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “మెట్రో సువర్ణ ఆఫర్ కింద రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు మెట్రో ప్రయాణికులకు టికెట్లపై 40 శాతం రాయితీని ఇవ్వాలని నిర్ణయించాము. 

• స్మార్ట్ కార్డు ద్వారా 14 ట్రిప్పుల ఛార్జీతో 30 రోజులలో 20 ట్రిప్పులు తిరుగవచ్చు. 

• అదేవిధంగా 20 ట్రిప్పుల ఛార్జీతో 45 రోజులలో 30 ట్రిప్పులు తిరుగవచ్చు.

• అదేవిధంగా 40 ట్రిప్పుల ఛార్జీతో 60 రోజులలో 60 ట్రిప్పులు తిరుగవచ్చు.

నవంబర్‌ 1వ తేదీ నుంచి మొదలయ్యే మరో ఆఫర్‌ను కూడా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇవాళ్ళ ప్రకటించారు. దీనిని పొందేందుకు టీ-సవారీ మొబైల్ యాప్‌ ద్వారా టికెట్ కొనుగోలు చేయవలసి ఉంటుందని చెప్పారు. 

•  7 ట్రిప్పుల ఛార్జీతో 30 రోజులలో 10 ట్రిప్పులు తిరుగవచ్చు.

• 14 ట్రిప్పుల ఛార్జీతో 30 రోజులలో 20 ట్రిప్పులు తిరుగవచ్చు. 

• 20 ట్రిప్పుల ఛార్జీతో 45 రోజులలో 30 ట్రిప్పులు తిరుగవచ్చు. 

• 30 ట్రిప్పుల ఛార్జీతో 45 రోజులలో 45 ట్రిప్పులు తిరుగవచ్చు.

• 40 ట్రిప్పుల ఛార్జీతో 60 రోజులలో 60 ట్రిప్పులు తిరుగవచ్చు.

అంటే ఉదాహరణకు అమీర్‌పేట్‌ నుంచి రోజూ హైటెక్‌సిటీకి వెళ్ళేవారు 14సార్లు తిరిగేందుకు చెల్లించే టికెట్ ధరతో అదనంగా మరో ఆరు సార్లు తిరుగవచ్చు. కానీ ఈ టికెట్ కొనుగోలు చేసినప్పటి నుంచి 30 రోజులలోపుగానే వినియోగించుకోవలసి ఉంటుంది. అంటే ఒక విధంగా ఈ ఆఫర్ సీజన్ టికెట్ వంటిదని భావించవచ్చు. ప్రస్తుతం భారీ వర్షాలతో హైదరాబాద్‌ నగరవాసులు తమ గమ్యస్థానాలకు చేరుకొనేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక మెట్రో ప్రకటించిన ఈ పండుగ ఆఫర్లు మంచి అవకాశమని చెప్పవచ్చు. 

Related Post