హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఊబర్ బస్సులు

September 19, 2020
img

ఊబర్ సంస్థ గురువారం హైదరాబాద్‌ నగరంలో ప్రజారవాణా (మినీ బస్/వ్యాన్) సర్వీసులను లాంఛనంగా ప్రారంభించింది. హైదరాబాద్‌ మెట్రో రైల్‌, ఎల్&టి సంస్థలతో ఒప్పందం చేసుకొన్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు ప్రబ్‌జీత్ సింగ్‌ మీడియాకు తెలియజేశారు. ఊబర్ ప్రజారవాణా సేవలను వినియోగించుకొనేందుకు ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్‌ను కూడా విడుదల చేశామని చెప్పారు. దాంతో ప్రజలు టికెట్స్ బుక్‌ చేసుకోవచ్చు. తాము ప్రయాణించాలనుకొంటున్న అర్గంలో అందుబాటులో ఉన్న బస్ సర్వీసుల వివరాలు తెలుసుకోవచ్చు. అవి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి. ఎంతసేపులో తాము ఉన్నచోటికి చేరుకొంటాయి? గమ్యస్థానం చేరేందుకు ఎంత సమయం పడుతుంది?వంటి సమస్త వివరాలను మొబైల్ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చునని చెప్పారు. ఢిల్లీ మెట్రో రైల్ సంస్థతో ఒప్పందం చేసుకొని అక్కడ విజయవంతంగా సర్వీసులను నడిపిస్తున్నామని, అదే స్పూర్తితో ఇక్కడ హైదరాబాద్‌లో కూడా నడిపించబోతున్నామని ప్రబ్‌జీత్ సింగ్‌ చెప్పారు. 

హైదరాబాద్‌ మెట్రో రాకతో ఆర్టీసీ బస్సులపై తీవ్ర ప్రభావం పడింది. మెట్రోను కాపాడేందుకు ప్రభుత్వం కొన్ని మార్గాలలో ఆర్టీసీ సర్వీసులను కుదించివేసింది. ఆ తరువాత 55 రోజుల ఆర్టీసీ సమ్మె, దాని తరువాత లాక్‌డౌన్‌లతో టీఎస్‌ఆర్టీసీ చాలా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు నగరంలో ఊబర్ బస్ సర్వీసులు మొదలైతే ఇక ఆర్టీసీ సిటీ బస్సులు నడుపడం కష్టమే కావచ్చు. కరోనా భయంతో నేటికీ నగరంలో సిటీ బస్సులు నడిపించలేకపోతుండటంతో ఆర్టీసీ కార్మికులు తమ ఉద్యోగాల విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీని కాపాడుకోకపోతే వాటిలో పనిచేసే ఆర్టీసీ కార్మికులే కాదు నిత్యం ఆర్టీసీ బస్సులపై ఆధారపడే సామాన్య ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతారు.

Related Post