పార్సిల్ ఛార్జీలను తగ్గించిన టీఎస్‌ఆర్టీసీ

July 24, 2020
img

ఆర్టీసీ సమ్మె, లాక్‌డౌన్‌, ఇప్పుడు కరోనా...ఇలా వరుసదెబ్బలతో నష్టాలలో కూరుకుపోతున్న టీఎస్‌ఆర్టీసీ కుప్పకూలిపోకుండా నిలబెడుతున్నది టీఎస్‌ఆర్టీసీ కార్గో అండ్ పార్సిల్ సర్వీసులే అంటే అతిశయోక్తి కాదు. దాంతో టీఎస్‌ఆర్టీసీకి రోజుకు సుమారు రూ. 5 లక్షల ఆదాయం లభిస్తున్నట్లు సమాచారం. అయితే టీఎస్‌ఆర్టీసీ మనుగడకు అది ఏమాత్రం సరిపోదు కనుక కార్గో అండ్ పార్సిల్ సర్వీసుల ద్వారా ఆదాయం మరింత పెంచుకొనేందుకుగాను టీఎస్‌ఆర్టీసీ పార్సిల్ సర్వీస్ చార్జీలను తగ్గించింది. తద్వారా సామాన్యప్రజలకు కూడా దాని సేవలు వినియోగించుకొనేలా ప్రోత్సహించినట్లవుతుంది. 

ఇప్పటి వరకు శ్లాబ్ రేట్లు 0-10 కిలోల మద్య ఉండేవి. వాటిని 0-5కు తగ్గించి, 6-10 కేజీలకు మరో శ్లాబ్ నిర్ణయించింది. ఇదివరకు కేజీకైనా 10 కేజీలకైనా ఒకటే ఛార్జీ ఉండేది కనుక తక్కువ బరువు గల పార్సిల్ పంపించడానికి ఎక్కువ ఛార్జీలు చెల్లించవలసివచ్చేది. కానీ ఇప్పుడు రెండు వేర్వేరు శ్లాబులు ఏర్పాటు చేసినందున ఛార్జీలు కూడా తగ్గుతాయి. 

ఇప్పటివరకు 0-10 కేజీలను 75కిమీ దూరంలో ఉన్న ప్రాంతానికి పంపించేందుకు రూ.50 వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు 0-5కిలోల లోపు పార్సిల్‌ను75కిమీ దూరంలో ఉన్న ప్రాంతానికి పంపించేందుకు ఇప్పుడు కేవలం రూ.20లు మాత్రమే ఛార్జీ చెల్లిస్తే సరిపోతుంది. 

అదేవిధంగా 6-10 కిలోలలోపు బరువున్న పార్సిల్‌ను 75కిమీ దూరంలో ఉన్న ప్రాంతానికి పంపించేందుకు ఇప్పుడు కేవలం రూ.50లు మాత్రమే ఛార్జీ చెల్లిస్తే సరిపోతుంది. 

అంతర్ రాష్ట్ర పార్సిల్ చార్జీలను కూడా తగ్గించింది. ఇదివరకు 250 గ్రాముల బరువున్న పార్సిల్‌ను పొరుగు రాష్ట్రానికి పంపేందుకు రూ.75 వసూలు చేస్తుండగా ఇప్పుడు దానిని రూ.40కి తగ్గించారు.       

టీఎస్‌ఆర్టీసీ తెలంగాణ ప్రజలందరిదీ కనుక దానిని ప్రభుత్వమే కాపాడాలనుకోకుండా, టీఎస్‌ఆర్టీసీ కార్గో అండ్ పార్సిల్ సర్వీసులను ప్రజలు కూడా ఆదరిస్తే టీఎస్‌ఆర్టీసీకి మళ్ళీ గాడినపడుతుంది.

Related Post