తూర్పు గోదావరిలో అదుపులోకి వచ్చిన గ్యాస్ లీకేజ్

February 04, 2020
img

తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలో ఉప్పూడి గ్రామంలో ఓఎన్‌జీసీకి చెందిన బావి నుంచి గత రెండు రోజులుగా భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. దానిని మూసేందుకు ఓఎన్‌జీసీ, అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడంతో కోట్లు విలువచేసే గ్యాస్ వృధాగా గాలిలో కలిసిపోయింది. పైగా గ్యాస్ లీకేజీ కారణంగా అగ్నిప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉన్నందున పరిసర ప్రాంతాలలో ప్రజలను ఇళ్ళు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముందుజాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేయడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద శబ్ధంతో గ్యాస్ లీకేజ్ అవుతుండటంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరూ ఉండలేకపోతున్నారు. 

ముంబై నుంచి వచ్చిన ఓఎన్‌జీసీ ప్రత్యేక బృందం ఈరోజు ఉదయం సుమారు 80,000 లీటర్ల బురదనీటిని గ్యాస్ బావిలోకి పంపులద్వారా పంపింగ్ చేశారు. దాంతో బావి నుంచి వెలువడుతున్న గ్యాస్ ఒత్తిడి తగ్గింది. వెంటనే ఓఎన్‌జీసీ సిబ్బంది వాల్వులను మూసివేయడంతో బావిలో నుంచి గ్యాస్ లీకేజ్ పూర్తిగా నిలిచిపోయింది. దాంతో రెండు రోజులుగా శ్రమిస్తున్న ఓఎన్‌జీసీ, అగ్నిమాపక సిబ్బంది, గ్యాస్ లీకేజితో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులకు ఊపిరి పీల్చుకొన్నారు.

Related Post