సంక్రాంతి వసూళ్ళు అదుర్స్

January 18, 2020
img

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన అన్ని సినిమాలు భారీగా కలెక్షన్స్ రాబడుతుంటే, వాటితో పోటీ పడుతూ  టీఎస్‌ఆర్టీసీ కూడా భారీగా కలెక్షన్స్ రాబట్టడం విశేషం. గత ఏడాది సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులతో రూ.84 కోట్లు ఆర్జించగా, ఈసారి 4,000 పండగ ప్రత్యేక బస్సులను నడిపించి రూ.94 కోట్లు ఆర్జించింది. ఇవి ఈనెల 16 వరకు వసూలైన కలెక్షన్స్ మాత్రమే. సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్ళినవారు ఇప్పుడిప్పుడే తిరుగుప్రయాణాలు అవుతున్నారు కనుక మరొక 4-5 రోజులవరకు టీఎస్‌ఆర్టీసీకి భారీగానే ఆదాయం సమకూరనుంది. ఇది పూర్తికాగానే మేడారం జాతర హడావుడి మొదలవుతుంది. కనుక రాష్ట్రం నలుమూలల నుంచి మేడారంకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేకబస్సులు నడిపించబోతోంది. సంక్రాంతి పండుగ కంటే మేడారం జాతర ద్వారా టీఎస్‌ఆర్టీసీకి చాలా భారీ ఆదాయం లభించనుంది. 55 రోజులపాటు సాగిన ఆర్టీసీ సమ్మె కారణంగా తీవ్ర నష్టాలలో కూరుకుపోయిన టీఎస్‌ఆర్టీసీకి ఈ అదనపు రాబడితో మళ్ళీ కాస్త తేరుకోగలుగుతుంది. 


Related Post