ఫాస్టాగ్‌ లేకపోతే టోల్‌గేట్‌ వద్ద బాదుడే

January 17, 2020
img

టోల్‌గేట్ల వద్ద రద్దీని తగ్గించేందుకుగాను కేంద్రప్రభుత్వం ఫాస్టాగ్ విధానం అమలులోకి తెచ్చింది. కానీ నేటికీ చాలా మంది వాహనదారులు ఫాస్టాగ్స్ తీసుకోకుండా టోల్‌గేట్ల వద్ద నగదు చెల్లింపుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో మళ్ళీ యధాప్రకారం టోల్‌గేట్ల వద్ద బారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్‌ అవుతోంది. కనుక వాహనదారులందరూ తప్పనిసరిగా ఫాస్టాగ్స్ విధానంలోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ టోల్‌గేట్ల వద్ద నగదు చెల్లింపులపై రాయితీలు రద్దు చేసి ఆంక్షలు విధించింది. జనవరి 15 నుంచి దీనిని అమలుచేస్తున్నారు.

కనుక ఫాస్టాగ్‌ ఉన్న వాహనాలకు మాత్రమే 24 గంటలలో తిరిగివస్తే టోల్‌ ఫీజులో 50 శాతం రాయితీ లభిస్తుంది. నగదు చెల్లింపుచేసేవారు 100 శాతం ఫీజు చెల్లించాల్సిందే. పైగా టోల్‌ప్లాజాలో ఒకే ఒక గేటును మాత్రమే నగదు చెల్లింపులకు కేటాయించింది. కనుక టోల్‌గేట్‌ వద్ద గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకొని బయటపడేందుకు ఎదురుచూడటమే కాకుండా టోల్‌గేట్‌లో బారీగా ఫీజ్ చెల్లించవలసి వస్తుంది. కనుక అందరూ తప్పనిసరిగా ఫాస్టాగ్ విధానంలోకి మారకతప్పదు. ఇక రోజూ జాతీయరహదారులపై టోల్‌ప్లాజాల ద్వారా రాకపోకలు సాగించేవారి కోసం నెలవారి పాసులను జారీ చేస్తోంది. ఇవి తీసుకొన్నట్లయితే ఫాస్టాగ్ విధానంలో లభించే రాయితీ లభిస్తుంది. అయితే ముందుగా ఒకసారి ఫాస్టాగ్ తీసుకోవలసి ఉంటుంది.

Related Post