హైదరాబాద్‌లో సిటీ బస్సులు తగ్గింపు?

December 12, 2019
img

హైదరాబాద్‌ నగరంలో నేటి నుంచి దశలవారీగా 1,000 సిటీ బస్సులను తగ్గించబోతోంది ఆర్టీసీ యాజమాన్యం. హైదరాబాద్‌ పరిధిలో 550, సికింద్రాబాద్‌లో పరిధిలో 450 బస్సులను తగ్గించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. తొలగించిన బస్సులలో కొన్నిటిని సరుకు రవాణాకు వినియోగించబోతోంది. 

ఇక నుంచి ఆర్టీసీని స్వయంగా పర్యవేక్షిస్తూ లాభాలబాటలోకి నడిపిస్తానని సిఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రయత్నాలలో భాగంగా సిఎం కేసీఆర్‌ తీసుకొన్న ఈ నిర్ణయాన్ని వెంటనే అమలుచేయడానికి ఆర్టీసీ అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాలలో కొన్ని బస్సులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. 

ఆ 1,000 బస్సులలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్కులు, సూపర్‌వైజర్లు కలిపి సుమారు 4,000 మంది వరకు ఉంటారు. వారిలో కొందరు డ్రైవర్లను సరుకు రవాణా బస్సులకు, మిగిలినవారిని ఇతర శాఖలలోను వినియోగించుకోబోతున్నట్లు సమాచారం. కండక్టర్లు, మెకానిక్కులు, సూపర్‌వైజర్లను ఎక్కడ సర్దుబాటు చేయాలనేదానిపై అధికారులు చర్చిస్తున్నట్లు సమాచారం.

జంటనగరాలలో ఆర్టీసీ బస్సులన్నీ కిటకిటలాడుతూ ప్రయాణిస్తుంటాయనే సంగతి నగర ప్రజలందరికీ తెలుసు. అంటే సరిపడినన్ని బస్సులు లేవని, మరిన్ని కొత్త బస్సులు వేయాలని అర్ధమవుతోంది. కానీ ఉన్నవాటినే తొలగిస్తే వాటిపైనే ఆధారపడుతున్న సామాన్యప్రజలు మరింత ఇబ్బందిపడతారు. కనుక వాటి స్థానంలో అద్దెబస్సులనో లేక ప్రైవేటు బస్సులను ప్రవేశపెట్టాలనుకొంటున్నారా?అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఆ 1,000 బస్సులలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్కులు, సూపర్‌వైజర్లను ఎక్కడ సర్దుబాటు చేస్తారో చూడాలి.

Related Post