మేడారం జాతరకు సన్నాహాలు షురూ

December 07, 2019
img

వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర మొదలవుతుంది. ఈ జాతరకు హైదరాబాద్‌తో సహా తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకొంటుంటారు. ఇరుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. మేడారం జాతర ఫిబ్రవరిలో మొదలవుతున్నప్పటికీ నెలరోజులు ముందు నుంచే బారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. కనుక ఇప్పటి నుంచే అధికారులు మేడారం జాతరకు అవసరమైన ఏర్పాట్లు మొదలుపెట్టారు.

టీఎస్‌ఆర్టీసీ కూడా మేడారం జాతరకు సిద్దం అవుతోంది. గత ఏడాది రాష్ట్రం నలుమూలల నుంచి 3,500 బస్సులు నడిపించి సుమారు 17 లక్షల మందికి పైగా భక్తులను మేడారం జాతరకు చేరవేసింది. ఈసారి 22 లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని ఆర్టీసీ ఈడీ వినోద్ కుమార్, ములుగు జిల్లా రీజినల్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం వారిరువురూ స్థానిక అధికారులు, సిబ్బందితో కలిసి అమ్మవార్ల గద్దెలను దర్శించుకొన్న తరువాత మేడారంలో ఆర్టీసీ క్యూ లైన్ పనులు మొదలుపెట్టారు. 

ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి 3,500 బస్సులు నడిపిస్తామని తెలిపారు. హైదరాబాద్‌ నుంచి మేడారంకు ఏసీ బస్సులను కూడా నడిపిస్తామని, బస్సు టికెట్లను ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చునని తెలిపారు. మేడారం జాతర బస్సుల కోసం 12,500 మందిని కేటాయిస్తామని తెలిపారు. 

నష్టాల ఊబిలో కూరుకుపోయిన టీఎస్‌ఆర్టీసీకి మేడారం జాతర ఒక పెద్ద వరంగా చెప్పవచ్చు. లక్షలాది మందిని తరలించడం ద్వారా ఆర్టీసీకి చాలా బారీగా ఆదాయం సమకూరుతుంది. అందుకే ఈసారి మరింత ఎక్కువగా అంటే 22 లక్షల మందిని మేడారం జాతరకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు అర్ధం అవుతోంది. అంటే స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా నెరవేరుతుందన్న మాట!

Related Post