ఇక బీఎస్ఎన్ఎల్‌ కనబడదా?

November 08, 2019
img

అనేక ప్రభుత్వరంగ సంస్థలలాగే బీఎస్ఎన్ఎల్‌ కూడా దయనీయ స్థితికి చేరుకోవడంతో దానిని మరో ప్రభుత్వరంగ సంస్థ ఎంటిఎన్ఎల్‌లో విలీనం చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. కానీ అంతకంటే ముందు బీఎస్ఎన్ఎల్‌లో స్వచ్ఛంద పదవీ విరమణల (వీఆర్ఎస్) ద్వారా కొందరు ఉద్యోగులను తగ్గించుకోవాలని నిర్ణయించి నవంబర్ 5 నుంచి డిసెంబర్ 3వరకు వీఆర్ఎస్ పధకాన్ని అమలుచేస్తోంది. 

సాధారణంగా ఏ సంస్థలోనైన వీఆర్ఎస్ పధకాన్ని ప్రకటిస్తే ఉద్యోగులు అంతగా ఆసక్తి చూపరు కానీ బీఎస్ఎన్ఎల్‌లో మాత్రం అందుకు విరుద్దంగా వీఆర్ఎస్ పధకం ప్రకటించిన మొదటి రోజునుంచే భారీగా దరఖాస్తులు అందుతున్నాయి. మొదటి రెండు రోజులలోనే ఏకంగా 22,000 మంది వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకొన్నారని బీఎస్ఎన్ఎల్‌ తెలిపింది. బీఎస్ఎన్ఎల్‌లో సుమారు 1.50 లక్షల మందికి పైగా ఉద్యోగులున్నారు. వారిలో 50 శాతం మంది పదవీ విరమణ వయసుకు దగ్గర పడినవారే ఉన్నందున ఈ నెల రోజులలోగా వారిలో చాలామంది వీఆర్ఎస్ తీసుకొన్నట్లయితే సంస్థపై ఆర్ధికభారం గణనీయంగా తగ్గిపోతుందని బిఎస్ఎన్ఎల్ భావిస్తోంది. 

దేశవ్యాప్తంగా విస్తృతమైన నెట్‌వర్క్‌, లక్షల మంది ఉద్యోగులు, కోట్లాది వినియోగదారులు కలిగిన బిఎస్ఎన్ఎల్‌కు ఈ దుస్థితి ఎందుకు కలిగింది?అంటే అనేక కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో ప్రధానంగా జియో కొట్టిన దెబ్బకే బిఎస్ఎన్ఎల్‌ మూతపడే పరిస్థితికి చేరుకొందని చెప్పుకోక తప్పదు. 

జియో 4జి ఫీచర్ ఫోన్‌ ప్రవేశపెట్టి దానితో కేవలం రూ.49లకే 28 రోజులు అపరిమితమైన కాల్ సౌకర్యం కల్పించడంతో, చాలామంది బిఎస్ఎన్ఎల్‌ వినియోగదారులు జియోకు మారిపోయారు. మూడేళ్ళ క్రితం జియో 4జితో ప్రవేశించినప్పుడే బిఎస్ఎన్ఎల్‌ అప్రమత్తమయ్యి ఉండాల్సింది. కానీ విస్తృతమైన నెట్‌వర్క్‌, లక్షల మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ 4జి నెట్‌వర్క్‌లోకి మారలేకపోయింది. కాల్స్, డాటా, ప్లాన్స్ విషయంలో కూడా జియోతో పోటీ పడలేకపోయింది. 

దీనికి తోడు బిఎస్ఎన్ఎల్‌ ప్రభుత్వరంగ సంస్థ కావడంతో ఉద్యోగులలో సహజంగా కనబడే అలసత్వం, ఆ కారణంగా వినియోగదారులకు సేవలు అందించడంలో లోపాలు, విధానపరమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుచేయడంలో ఆలస్యం వంటివెన్నో బిఎస్ఎన్ఎల్‌ను ఈ దుస్థితికి తీసుకువచ్చాయని చెప్పుకోవచ్చు. ఇది బిఎస్ఎన్ఎల్‌ స్వయంకృతాపరాధమే కనుక జియోను నిందించడం కూడా అనవసరం.

Related Post