ఇంటివద్దకే ఏటిఎం.. వేలిముద్రతో డబ్బు

November 07, 2019
img

దేశంలో కోట్లాదిమంది వృద్ధులు, మహిళలు, వికలాంగులు డబ్బు అవసరమైతే ఓపిక ఉన్నా లేకపోయినా  బ్యాంకులకో ఏటిఎం వద్దకో వెళ్ళకతప్పడం లేదు. అటువంటి వారి కోసం పోస్టల్ శాఖ ఇంటికే వచ్చి డబ్బు చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో ఆధార్ కార్డు, వేలిముద్రతో డబ్బు పొందవచ్చు. 

దీనికోసం పోస్టల్ శాఖ ఏర్పాటు చేసిన 155299 టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేస్తే, మీ సమీపంలోని పోస్టాఫీసు నుంచి పోస్ట్ మ్యాన్ ‘మొబైల్ మైక్రో ఏటిఎం’ ఇంటికి వస్తారు. అతనికి మీ ఆధార్ చూపించి మొబైల్ మైక్రో ఏటిఎంలో వేలిముద్ర వేస్తే అతను మీకు డబ్బు అందజేస్తాడు. దీని ద్వారా పోస్టాఫీస్ ఖాతాలే కాకుండా ఏ బ్యాంక్‌లో మీకు ఖాతా ఉన్నప్పటికీ డబ్బు పొందవచ్చు. ఈ విధానంలో కనీసం రూ.100 నుంచి రూ.10,000 వరకు తీసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబడవు. దీనితో మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు తీసుకోవడమే కాకుండా బ్యాలెన్స్, లావాదేవీల వివరాలు కూడా ఉచితంగా పొందవచ్చు.       

దీనితో ఏవిధంగా డబ్బు తీసుకోవాలంటే... ముందుగా 155299 టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేయాలి. ఇంటికి వచ్చిన పోస్ట్ మేన్‌కి మీ పేరు, మొబైల్ నెంబర్ చెప్పాలి. వాటిని అతను మొబైల్ మైక్రో ఏటిఎంలో ఎంటర్ చేయగానే మీ మొబైల్ నెంబరుకు ఓటిపి వస్తుంది. దానిని మొబైల్ మైక్రో ఏటిఎంలో ఎంటర్ చేసిన తరువాత మీ ఆధార్ నెంబరు ఎంటర్ చేయాలి. ఆ తరువాత దానిలో ఉండే జాబితాలో నుంచి మీ బ్యాంక్‌ను ఎంచుకొని అవసరమైన మొత్తాన్ని ఎంటర్ చేయాలి. ఆ తరువాత మొబైల్ మైక్రో ఏటిఎంకు అనుసంధానించబడిన బయోమెట్రిక్ మెషిన్‌లో మీ వేలిముద్ర వేస్తే ఆ మొత్తాన్ని పోస్ట్ మెన్ మీకు అందిస్తాడు. దాంతో మీ లావాదేవీ పూర్తవుతుంది. అయితే ఈ సౌకర్యం పొందాలంటే మీ మొబైల్, ఆధార్ నెంబర్లు మీ బ్యాంక్‌లో ముందుగానే రిజిస్టర్డ్ అయ్యుండాలి.

Related Post