హైదరాబాద్‌-షోలాపూర్ మద్య ఆయిల్ పైప్‌లైన్

September 17, 2019
img

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) హైదరాబాద్‌ కేంద్రంగా దేశంలో తూర్పు-పడమర రాష్ట్రాలను అనుసంధానం చేయబోతోంది. దీనికోసం హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని షోలాపూర్ వరకు ఆయిల్ సరఫరా కోసం ఐఓసి ఒక పైప్‌లైన్ నిర్మించబోతోంది.

దేశానికి పశ్చిమాన్న గల గుజరాత్ రాష్ట్రంలోని కోయలి నుంచి ఇప్పటికే అహ్మద్ నగర్ మీదుగా షోలాపూర్ వరకు 747 కిమీ పొడవైన ఆయిల్ ఆయిల్ పైప్‌లైన్ నిర్మాణం కొనసాగుతోంది. 

అదేవిధంగా తూర్పున ఒడిశా రాష్ట్రంలోని పారాదీప్‌ నుంచి హైదరాబాద్‌ వరకు 1,212 కిమీ పొడవైన పైప్‌లైన్ నిర్మాణం కూడా జరుగుతోంది. ఇప్పటికే పారాదీప్ నుంచి రాజమండ్రి వరకు పైప్‌లైన్ నిర్మాణం పూర్తయింది. కొన్ని రోజుల క్రితమే రాజమండ్రి నుంచి గోదావరినదికి ఆవలివైపు వరకు పైప్‌లైన్ నిర్మాణం కూడా పూర్తయింది. 

కనుక హైదరాబాద్‌-షోలాపూర్ మద్య పైప్‌లైన్ నిర్మాణం పూర్తయితే గుజరాత్ నుంచి మహారాష్ట్ర, తెలంగాణ (హైదరాబాద్‌), గుల్బర్గా (కర్ణాటక), ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒడిశా వరకు గల అన్ని ఐఓసి ఆయిల్ ప్లాంట్స్ అనుసంధానం అవుతాయి. తద్వారా ఈ 5 రాష్ట్రాలలో ఆయిల్ సరఫరా సులభతరం అవుతుంది. ఒకవేళ 5 రాష్ట్రాలలో ఎక్కడైనా ఏ కారణం చేతైనా ఆయిల్ ఉత్పత్తి, సరఫరాలో అంతరాయలు, సమస్యలు ఎదురైనా లేదా హటాత్తుగా డిమాండ్ పెరిగినా తక్షణమే సమీప రాష్ట్రం నుంచి ఆ ప్రాంతానికి అవసరమైనంత ఆయిల్ సరఫరా చేయడం సాధ్యపడుతుంది. 

ప్రస్తుతం హైదరాబాద్‌-షోలాపూర్ మద్య నిర్మించబోయే ఆయిల్ సరఫరా పైప్‌లైన్ నిర్మాణం కోసం సర్వే జరుగుతోంది. అది పూర్తికాగానే ఈ ప్రాజెక్టు పూర్తి వ్యయఅంచనాలతో సమగ్ర నివేదికను రూపొందిస్తారు. దానికి కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ, ఆర్ధిక, పర్యావరణ శాఖలు ఆమోదం తెలుపగానే నిర్మాణపనులు మొదలవుతాయి. ఈ పనులు పూర్తయ్యేలోగా హైదరాబాద్‌ సమీపంలోని మల్కాపూర్ వద్ద నిర్మిస్తున్న ఐఓసి చమురుశుద్ది కేంద్రం కూడా ఉత్పత్తికి సిద్దం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.     

దేశంలో తూర్పు-పడమర రాష్ట్రాలను ఈవిధంగా మన హైదరాబాద్‌ నగరం అనుసంధానిస్తుండటం మనందరికీ గర్వకారణమే కదా.

Related Post