కొత్త సినిమాలు ఇంట్లోనే చూపిస్తే...

August 13, 2019
img

సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్న జియో, సెప్టెంబర్ 5 నుంచి తన జియో ఫైబర్ నెట్ సేవలను దేశవ్యాప్తంగా ప్రారంభించబోతోంది. ఒకే కనెక్షన్ ద్వారా బ్రాడ్ బ్యాండ్, డీటీహెచ్, ల్యాండ్ లైన్ సేవలు అందించబోతోంది. వచ్చే ఏడాది నుంచి ధియేటర్లలో కొత్త సినిమాలు విడుదలైన రోజునే జియో ఫైబర్ వినియోగదారులకు తమ ఇళ్ళలోనే కూర్చొని చూసుకునే అవకాశం కల్పించబోతున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఈ ప్రకటన దేశంలో వేలాది సినిమా థియేటర్ల మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చే ప్రమాదం ఉంటుందని ధియేటర్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన మల్టీప్లెక్స్ ధియేటర్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని ఐనాక్స్, పీవీర్‌ సినిమాథియేటర్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. 2018 ఆర్ధిక సంవత్సరంలో సినీ పరిశ్రమకు వివిద మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.17,450 కోట్లు కాగా దానిలో 75 శాతం ఆదాయం థియేటర్ల నుంచి వచ్చినదేనని ఫికీ నివేధికలో పేర్కొంది. ఒకవేళ జియో ఫైబర్ ద్వారా కొత్త సినిమాలు విడుదలైన మొదటిరోజునే ఇళ్ళలో కూడా చూసుకునే అవకాశం కల్పిస్తే థియేటర్లకు వచ్చేవారి సంఖ్య భారీగా తగ్గిపోతుంది కనుక థియేటర్ల యాజమాన్యాలు, వాటిపై ఆధారపడిన డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఐనాక్స్, పీవీర్‌ సినిమాథియేటర్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. అదే కనుక జరిగితే సినీ పరిశ్రమపై కూడా తీవ్ర ప్రభావం పడటం ఖాయమని హెచ్చరించాయి. 

కనుక ఈ ఆలోచనను విరమించుకుంటే మంచిదని, థియేటర్లలో సినిమా విడుదలైన 8వారాల తరువాత జియో ఫైబర్ నెట్ ద్వారా ఇళ్ళలో ప్రదర్శించినా పెద్దగా నష్టం ఉండదని సినిమా థియేటర్ల యజమానులు అంటున్నారు. అయితే టెలికాం రంగంలో విధ్వంసం సృష్టించి దూసుకుపోతున్న జియో, సినిమా థియేటర్ల యాజమానుల మొర ఆలకిస్తుందనుకోలేము. వారి కంటే ముందుగా  ఇంటర్నెట్, డీటీహెచ్ సేవలందరిస్తున్న చిన్న పెద్ద సంస్థలకు సెప్టెంబర్ 5 నుంచి అగ్నిపరీక్ష ప్రారంభం కాబోతోంది. 


Related Post