రూ.1500 కోట్ల పెట్టుబడితో మహేశ్వరంలో భారీ పరిశ్రమలు

July 18, 2019
img

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిననాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే నిర్ణయాలు, విధానాలు అమలుచేస్తున్నందున రాష్ట్రానికి అనేక కొత్త పరిశ్రమలు తరలివస్తున్నాయి. వాటికోసం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ సకల సౌకర్యాలతో పారిశ్రామికవాడలు ఏర్పాటు చేస్తుండటం అందరికీ తెలుసు. శంషాబాద్‌ విమానాశ్రయానికి సమీపంలో మహేశ్వరం వద్ద 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రానిక్ సిటీ (ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పారిశ్రామికవాడ)లో రూ.1,500 కోట్లు పెట్టుబడితో ఎలక్ట్రికల్ వాహనాలకు అవసరమైన బ్యాటరీలు తయారుచేసే మూడు భారీ పరిశ్రమలు రాబోతున్నాయని రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ డైరక్టర్ సూరజ్ కరంపురి తెలిపారు. మొదటిదశలో 10 గిగావాట్స్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన సంస్థలు ఏర్పాటు కాబోతున్నట్లు తెలిపారు. మరొక రెండు మూడు నెలలోగా ఈ మొదటి దశ ఎలెక్ట్రానిక్ పార్కులో నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పారు.

భారత్‌లో ఇప్పుడిప్పుడే విద్యుత్ వాహనాల ఉత్పత్తి, అమ్మకాలు మొదలైనందున ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు దేశవిదేశాలకు చెందిన అనేక కంపెనీలు మహేశ్వరంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నాయని సూరజ్ కరంపురి తెలిపారు. మహేశ్వరంలో పరిశ్రమల ఏర్పాటుకు అనేక కంపెనీలు ముందుకు వస్తునందున భవిష్యత్‌లో ఈ పార్కును మరో 1,000 ఎకరాలకు విస్తరించాలనుకొంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎలక్ట్రానిక్ పాలసీని రూపొందించి ప్రస్తుతం దానిపై సంబందిత రంగంలోని నిపుణులు, పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు తెలుసుకొంటోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ పాలసీని ప్రకటించిన తరువాత రాష్ట్రంలో భారీ ఎలెక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఎదురుచూస్తున్నాయని సూరజ్ కరంపురి తెలిపారు. ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ రంగంలో ప్రవేశించడంలో భారత్‌ చాలా ఆలస్యం చేసినప్పటికీ, ఇకపై శరవేగంగా దూసుకుపోవడం ఖాయమని సూరజ్ కరంపురి తెలిపారు.

Related Post