త్వరలో గద్వాల ఆయిల్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం

May 17, 2019
img

గద్వాల్ జిల్లాలోని బీచుపల్లిలో మూతపడిన ఆయిల్ ఫ్యాక్టరీని పునః ప్రారంభించేందుకు తెలంగాణ ఆయిల్ ఫెడ్ సంస్థ చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో 1983లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు ఆలోచన చేసినప్పటికీ అనేక అవరోధాల కారణంగా 1990లో ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభించింది. ఫ్యాక్టరీలో 135 మంది పనిచేసేవారు. సగటున రోజుకు 200 మెట్రిక్ టన్నుల వేరుశనగ తదితర నూనెలు ఉత్పత్తి చేసి విజయవర్ధన్ బ్రాండు నూనెలుగా అమ్మేవారు. కానీ  క్రమంగా ఫ్యాక్టరీ అధికారులు, కార్మికులలో అలసత్వం పెరగడం, నిర్వహణ వ్యయం పెరిగిపోవడం వంటి కారణాలతో బీచుపల్లి నూనె ఫ్యాక్టరీ నష్టాలలో కూరుకుపోయి 2003లో మూతపడింది. అంటే కేవలం 13 ఏళ్ళు మాత్రమే నడిచిందన్నమాట. అప్పటి నుంచి పాలకులు ఆ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించే ప్రయత్నాలు చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత తెలంగాణ ఆయిల్ ఫెడ్ సంస్థ మళ్ళీ దాని పునరుద్దరణకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

జాతీయ పాడి అభివృద్ధి మండలికి బాకీ ఉన్న రూ.11.26 కోట్లను తీర్చేందుకు ఆ సంస్థతో వన్-టైమ్ సెటిల్మెంట్ చేసుకొని ఇప్పటి వరకు మొత్తం రూ. 5.11 కోట్లు చెల్లించింది. మిగిలిన మొత్తాన్ని మరో మూడు నెలలలో వాయిదాల పద్దతిలో చెల్లించబోతోంది. త్వరలోనే కార్మికులను నియమించుకొని ఫ్యాక్టరీలో యంత్రాలకు అవసరమైన మరమత్తులు చేసి ఉత్పత్తి ప్రారంభిస్తామని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ అధికారులు చెపుతున్నారు.

గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని, వేరుశనగతో పాటు వివిదరకాల నూనెల ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. ఒకటి రెండు నెలలలోగా ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ప్రారంభమైతే గద్వాల...చుట్టుపక్కల గ్రామాలలో రైతులకు చాలా మేలు కలుగుతుంది.

Related Post