హైదరాబాద్‌ మెట్రో అప్ డేట్స్

April 18, 2019
img

అమీర్‌పేట్‌-హైటెక్‌సిటీ మార్గంలో సర్వీసులు ప్రారంభించినప్పటి నుంచి అన్ని మార్గాలలో కలిపి రోజుకు 2.30 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఆ సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటం మెట్రోకున్న ఆదరణకు నిదర్శనం. హైటెక్ సిటీ-మైండ్ స్పేస్ మార్గంలో పనులు డిసెంబరు 2019 లోగా పూర్తికాబోతున్నాయి. అదేవిధంగా కారిడార్-2లోని ఇమ్లీబన్-జూబ్లీ బస్ స్టేషన్ మద్య గల 10 కిమీ మార్గంలో పనులు కూడా ఈ నవంబరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. 

అయితే ఇమ్లీబన్- ఫలక్‌నుమా మద్య కేవలం 5 కిమీ దూరం మాత్రమే ఉన్నప్పటికీ దాని అలైన్ మెంటుపై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటంతో పనులు ముందుకు సాగడంలేదు. దీని కోసం ఎల్&టి సంస్థ నిధులు కూడా సమకూర్చుకోవలసి ఉంది కనుక ఇది పూర్తికావడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.      

 ఇక మెట్రో 2వ దశలో మూడు మార్గాలను ఎంపికచేసి, వాటిలో నిర్మాణ పనులు మొదలుపెట్టడానికి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును (డీపీఆర్) ఎల్&టి సంస్థ ప్రభుత్వానికి సమర్పించింది. వీటి కోసం సుమారు రూ.12, 000 కోట్లు అవసరం పడతాయని ఎల్&టి సంస్థ అంచనా వేసింది. డీపీఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లభిస్తే కేంద్రప్రభుత్వం అందించబోయే నిధుల ద్వారా కొంత, జపాన్ కు చెందిన జైకా సంస్థ నుంచి రుణంగా మరికొంత నిధులు సేకరించుకొని పనులు మొదలుపెట్టాలని ఎల్&టి సంస్థ భావిస్తోంది. ఈ నేపధ్యంలో 2వ దశ పనులు పూర్తికావడానికి కనీసం 5-10 ఏళ్ళు పట్టవచ్చునని తెలుస్తోంది.

2వ దశ కారిడర్లు: 

1. మైండ్ స్పేస్ చౌరస్తా నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిమీ పొడవునా ఎక్స్‌ప్రెస్‌ మెట్రో సర్వీసులు. 

2. బీ.హెచ్.ఈ.ఎల్. నుంచి ఇప్పుడున్న మియాపూర్ మెట్రో స్టేషన్ మీదుగా హఫీజ్ పేట, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, మోహిదీపట్నం మీదుగా లక్దీకాపూల్ వరకు 28 కిమీ పొడవుండే మెట్రో లైన్ వేయాలని ప్రతిపాదనలున్నాయి. 

Related Post