సిద్దిపేటలో సమీకృత రైతుబజార్ ప్రారంభం

February 06, 2019
img

మన దేశంలో కూరలు బజార్లు...చేపల బజార్లు ఏవిధంగా ఉంటాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా చికెన్, మాంసం దుఖాణాలు అపరిశుభ్రతకు నిలయంగా ఉంటాయి. ఈ పరిస్థితులను మార్చి పూర్తి పరిశుభ్రమైన, నాణ్యమైన, అత్యంత సౌకర్యవంతమైన ఆధునిక సమీకృత రైతు బజార్లను నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రూ.8.16 కోట్లు వ్యయంతో సిద్ధిపేటలో నిర్మించిన అటువంటి సమీకృత రైతుబజారును మాజీ మంత్రి, తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారం ప్రారంభించారు. రెండు అంతస్తులలో నిర్మించిన సమీకృత రైతుబజారులో 332 స్టాల్స్ ఉన్నాయి. వాటిలో కూరగాయలు, పండ్లు మొదలైన శాఖాహార ఉత్పత్తులకు, మాంసం, చేపలు మొదలైన మాంసాహార ఉత్పత్తులకు వేర్వేరుగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. రైతుబజారులో 280 స్టాల్స్ జిల్లాకు చెందిన రైతులకే కేటాయించారు. మరో 42 స్టాల్స్ కూరగాయలు అమ్ముకునేవారికి కేటాయించారు. ఈ సందర్భంగా హరీష్ రావు ప్రజలు, రైతులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, "నాణ్యమైన కూరగాయలు, పండ్లు, మాంస ఉత్పత్తులు పరిశుభ్రమైన వాతావరణంలో అన్నీ ఒకే చోట ప్రజలకు లభించేలా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ మార్కెటును నిర్మించాము. అయితే భవనాలు కట్టడం గొప్ప కాదు వాటిని ఎప్పటికీ పరిశుభ్రంగా ఉంచుకోవడమే గొప్ప. కనుక ప్రజలు, రైతులు, వ్యాపారులు అందరూ కలిసి దీనిని చక్కగా నిర్వహించుకొంటారని ఆశిస్తున్నాను," అని అన్నారు.

Related Post