మసాజ్ చేసుకోవాలా...అయితే కాచీగూడా స్టేషన్‌కు వెళ్ళండి

January 12, 2019
imgఅవును! కాచీగూడా రైల్వే స్టేషన్‌లో ఇప్పుడు మసాజింగ్ సేవలు కూడా లభిస్తున్నాయి. అంటే ఏదేదో ఊహించేసుకోవద్దు. స్టేషన్‌లో 8 మసాజింగ్ ఛైర్స్ ఏర్పాటు చేయబడ్డాయి. వాటిలో కూర్చోంటే చాలు...క్షణాలలో బాడీ మసాజ్ అయిపోతుంది. 

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ ‘క్లౌడ్‌ రెస్ట్‌ మసాజ్‌ చైర్ల’ను దేశంలో మొట్టమొదటిసారిగా కాచీగూడా  రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేయడం విశేషం. బెంగళూరుకు చెందిన గ్రేబాక్స్ టెక్నాలజీ అనే కంపెనీ వీటిని ఏర్పాటు చేసింది. డీఆర్‌ఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ వీటిని లాంఛనంగా ప్రారంభించారు. 

స్టేషన్‌లో మొత్తం 12 మసాజింగ్ ఛైర్లను ఏర్పాటు చేశారు. వాటిలో 4 కుర్చీలను 1వ నెంబరు ప్లాట్ ఫారంపై, మరో 4కుర్చీలను స్లీపర్ క్లాసు విశ్రాంతి గదిలో, 2,3 ప్లాట్ ఫారంలపై చెరో రెండు కుర్చీలను ఏర్పాటు చేశారు. వీటిని వినియోగించుకోవడానికి 5 నిమిషాలకు రూ.40,  పది నిమిషాలకు రూ.80, 15 నిమిషాలకు రూ.120 ఛార్జీ చెల్లించవలసి ఉంటుంది. 

వీటిలో కూర్చోంటే మెడ నుంచి కాళ్ళ వరకు మసాజ్ అవుతుంది. మోకాళ్ళు, నడుం, భుజం, మెడ నొప్పులతో బాధపడుతున్నవారికి ఈ మసాజ్ వలన చాలా ఉపశమనం కలుగుతుందని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఈ మసాజింగ్ కుర్చీలు ఉదయం 9.30 నుంచి రాత్రి 10.30 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. కనుక ప్రయాణానికి ముందు లేదా తరువాత వీలున్నప్పుడు వచ్చి ఈ కుర్చీలలో కూర్చొని సేద తీరవచ్చు.

Related Post