హైదారాబాద్ మెట్రో కొత్త రికార్డు

January 02, 2019
img

హైదారాబాద్ మెట్రో కొత్త రికార్డు సాధించింది. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబరు 31న రాత్రి 12.30 గంటల వరకు మెట్రో సర్వీసులు నడిపించడంతో ఆ ఒక్కరోజే 2 లక్షల మందికి పైగా ప్రయాణించారని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్‌-అమీర్‌పేట్‌ మార్గంలో 1.65 లక్షల మంది, నాగోల్-అమీర్‌పేట్‌ మార్గంలో 60,000 మంది మెట్రోలో ప్రయాణించారని తెలిపారు. హైదారాబాద్ మెట్రోలో అమీర్‌పేట్, కేపీహెచ్‌బీ, జేఎన్‌టీయూ, మియాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్‌ వంటి ప్రధానస్టేషన్లు సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకు ప్రయాణికులతో కిటకిటలాడాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ నెలాఖరులోగా అమీర్‌పేట్-హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సర్వీసులను ప్రారంభించాలని చాలా ప్రయత్నించాము కానీ అనివార్య కారణాల వలన ఆలస్యం అయ్యిందని తెలిపారు. ఈ నెలాఖరులోగా తప్పకుండా సర్వీసులు ప్రారంభించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ కారిడార్ లో కూడా మెట్రో సర్వీసులు ప్రారంభం అయితే రోజుకు మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య 3 లక్షలకు చేరవచ్చునని భావిస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు.

Related Post