నగదు లేకనే ఆంక్షలా?

October 01, 2018
img

దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకులలో అతి పెద్దబ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశవ్యాప్తంగా లక్షాలది ఖాతాధారులున్న బ్యాంక్. అంటే ఆర్ధికంగా ఎంతో బలంగా ఉందనుకోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు ఖాతాదారులకు ఏవో కొత్త ఆంక్షలు విధిస్తూ వారి ఆర్ధిక లావాదేవీలను పరిమితం చేయాలనే ప్రయత్నిస్తుంటుంది. ప్రస్తుతం క్లాసిక్‌, మ్యాస్ట్రో డెబిట్‌ కార్డు వినియోగదారులకు ఏటిఎం ద్వారా రోజుకు రూ.40,000 వరకు నగదు ఉపసంహరణ చేసుకొనే వెసులుబాటు ఉంది. దానిని అక్టోబర్ 31 అర్ధరాత్రి నుంచి రోజుకు రూ.20,000కు కుదించింది. సామాన్య ప్రజలు రోజుకు రూ.20,000కు మించి నగదు తీసుకోవడం లేదని, కానీ కొందరు బడా వ్యాపారస్తులు ఈ కార్డులతో రోజుకు రూ.40,000 నగదు తీసుకొంటున్నట్లు గమనించామని, అటువంటి వారిని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు స్టేట్ బ్యాంక్ ప్రకటించింది. 

అది నిజమే కావచ్చు. బ్యాంకుల ఆంక్షలు, కోతలు, మోసాల కారణంగా ఇప్పుడు సామాన్య ప్రజలు బ్యాంకులలో ఇదివరకులాగ నగదు జమా చేయడం లేదు. కనుక బ్యాంకులలో నగదు కొరత ఉంది. అందుకే నేటికీ దేశంలో వేలాది ఎటిఎంలు మూతపడున్నాయి. కానీ ఈ విషయం చెప్పుకోలేదు కనుక నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం తీసుకొన్నామని స్టేట్ బ్యాంక్ చెప్పుకొంటున్నట్లు భావించవచ్చు.

Related Post