లాభం:2,433 కోట్లు..నష్టం:14,876 కోట్లు

August 10, 2018
img

ఎస్.బి.ఐ.కి 2,433 కోట్లు లాభం..14,876 కోట్లు నష్టం వచ్చింది. అదేమిటి లాభం వస్తే మళ్ళీ నష్టం ఏమిటి అంటారా? అవును లాభం రావడం ఎంత నిజమో నష్టం రావడం అంతే నిజం. 

ఎస్.బి.ఐ ఖాతాలలో కనీస బ్యాలెన్స్ ఉంచని ఖాతాదారుల నుంచి జరిమానాల పేరిట 2018లో ఇప్పటి వరకు వసూలు చేసుకొన్న మొత్తం రూ. 2,433 కోట్లు. అంటే ఎస్.బి.ఐ. ఏమాత్రం శ్రమపడకుండా సంపాదించిన ఆ మొత్తం లాభమే కదా! 

ఎస్.బి.ఐ. తన ఖాతాదారుల నుంచి ముక్కు పిండి జరిమానాలు వసూలు చేసుకోగలిగింది కానీ అది ఇచ్చిన అప్పులను మాత్రం వసూలు చేసుకోలేకపోయింది. అందువలన ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.4,876 కోట్లు నష్టపోయింది. ఆ కారణంగా శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఎస్.బి.ఐ. షేర్లు బారీగా పతనం అయ్యాయి. దాని వలన ఎస్.బి.ఐ.కి మరో రూ.10,000 కోట్లు నష్టపోయింది. అంటే మొత్తం 14,876 కోట్లు నష్టపోయిందన్న మాట. ఎస్.బి.ఐ. తన ఖాతాదారుల నుంచి ముక్కు పిండి వసూలు చేసిన మొత్తం కూడా ఒక్క రోజులో ఆవిరైపోయింది. పైగా నష్టం మిగిలింది.

ఎస్.బి.ఐ.తో సహా అన్ని బ్యాంకులు నిఖచ్చిగా తిరిగి చెల్లించే సామాన్యులకు రుణాలు మంజూరు చేయడానికి వెనుకాడతాయి. వారిని అనుమానంగా చూస్తుంటాయి. రాజకీయ పరపతి ఉన్న విజయ్ మాల్యా వంటి ఆర్దికనేరగాళ్ళకు అప్పులిస్తే తిరిగి వసూలు చేసుకోలేమని తెలిసి ఉన్నప్పటికీ వారికి అప్పులిచ్చి నష్టాలలో కూరుకుపోతుంటాయి. వ్యవస్థాపరమైన ఇటువంటి లోపాలను సవరించుకోకుండా సామాన్య వినియోగదారులపైకి ఆ భారాన్ని బదిలీ చేసేస్తే నష్టాలను తగ్గించుకోవచ్చుననుకోవడం వెర్రి ఆలోచన. పేరుమోసిన ఆర్ధికనిపుణుల ఆధ్వర్యంలో నడిచే బ్యాంకింగ్ వ్యవస్థలకి ఇంత చిన్న విషయం తెలియదంటే ఆశ్చర్యంగా ఉంది. 

బ్యాంకులు తమ వైఫల్యాలకు సామాన్యులను బలి చేయాలనుకొంటుంన్నందున బ్యాంకులపై ప్రజల నమ్మకం కోల్పోతున్నారు. ఆ కారణంగా ఇప్పుడు బ్యాంకులు ఇదివరకులాగ తమ ఖాతాదారులకు కావలసినంత నగదు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాయి. 

కనుక ఇప్పటికైనా బ్యాంకులు తమ విధానాలను ఒకసారి సమీక్షించుకొని, సామాన్య వినియోగదారుల నమ్మకాన్ని పొందేందుకు కృషి చేస్తే మంచిది. లేకుంటే నష్టాలు పునరావృతం అవుతూనే ఉంటాయి. అప్పుడు బ్యాంకులకు ప్రత్యామ్నాయ వ్యవస్థలు పుట్టుకురాకమానవు. అదే జరిగితే నష్టపోయేది బ్యాంకులే తప్ప  ప్రజలు కాదని గ్రహించాలి.

Related Post