జూలై 16 నుంచి ఆన్-లైన్ ద్వారా జనరల్ టికెట్స్

July 13, 2018
img

మనదేశంలో అధికశాతం ప్రజలు జనరల్ టికెట్స్ పైనే రైళ్ళలో ప్రయాణిస్తుంటారు. ఆ టికెట్స్ కొనుగోలు కోసం గంట ముందుగా స్టేషన్ చేరుకొని క్యూలో నిలబడక తప్పదు. ఆ శ్రమను తప్పించేందుకు దక్షిణమధ్య రైల్వే కొత్తగా ‘యుటిఎస్’ అనే మొబైల్ యాప్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా మొబైల్ ఫోన్ నుంచి అన్ని రకాల రైళ్ళలో ప్రయాణించడానికి జనరల్     టికెట్స్ తో పాటు ప్లాట్ ఫారం టికెట్స్ కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం జూలై 16వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ చెప్పారు.  

అయితే ఈ సౌకర్యం వినియోగించుకోవాలంటే అనేక ఇబ్బందులు, నిబంధనలు కూడా ఉన్నాయి. అవేమిటంటే.

1. జిపిఎస్, ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న స్మార్ట్ ఫోన్ల ద్వారా మాత్రమే ఈ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. 

2. వివిధ పద్దతులలో ఆన్-లైన్ పేమెంట్ ద్వారా మాత్రమే టికెట్స్ కొనుగోలు చేయవచ్చు.   

3. ప్రయాణానికి మూడు గంటల ముందు మాత్రమే యుటిఎస్ యాప్ ద్వారా టికెట్స్ కొనుగోలు చేయవచ్చు. (టికెట్ తీసుకోకుండా ప్రయాణించేవారిని దృష్టిలో ఉంచుకొని ఈ నిబంధన విధించి ఉండవచ్చు.) 

4. స్టేషన్ లో ఉండగా ఈ యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చేయడం సాధ్యం కాదు. స్టేషన్ నుంచి కనీసం 15 మీటర్లు, గరిష్టంగా 5 కిమీ దూరంలో ఉన్నప్పుడు మాత్రమే దీని ద్వారా టికెట్స్ కొనుగోలు చేయవచ్చు. 

5. ఒకసారి టికెట్ బుక్ చేసుకొన్నాక రద్దు చేసుకోవడం సాధ్యం కాదు.

6. స్మార్ట్ ఫోన్స్ లేని వారు వేరొకరి ఫోన్ ద్వారా ఈ టికెట్స్ కొనుగోలు చేసినట్లయితే, టికెట్ ఐడి వగైరా వివరాలను స్టేషన్లలో టికెట్ కౌంటర్ లో సిబ్బందికి చెప్పి కాగితపు టికెట్ పొందవచ్చు. అంటే ఆన్-లైన్ ద్వారా జనరల్ టికెట్ కొనుగోలు చేసినా మళ్ళీ టికెట్ కోసం స్టేషన్ వద్ద క్యూలో నిలబడక తప్పదన్న మాట! 

Related Post