జూలై 1 నుంచి రేషన్ బంద్?

June 15, 2018
img

తెలంగాణాలో రేషన్ డీలర్లు జూలై 1వ తేదీ నుంచి సమ్మెకు సిద్దం అవుతున్నారు. రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా మూడేళ్ళ నుంచి ప్రభుత్వం అమలుచేస్తున్న బయోమెట్రిక్ విధానం వలన తాము నెలకు రూ.5-15,000 నష్టపోతున్నామని, కనుక తమకు కూడా ప్రభుత్వోద్యోగులలాగే జీతాలు ఇచ్చి ఆదుకోవాలని వారి డిమాండ్. తమకు జూనియర్ అసిస్టెంట్ స్కేల్ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

ఒకవేళ ఈ నెలాఖరులోగా ప్రభుత్వం స్పందించకుంటే జూలై 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని 17,000 రేషన్ షాపులు మూసివేసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేవలం హెచ్చరికలే కాకుండా జూలై నెలలో రేషన్ సరుకులను విడిపించుకోవడం కోసం ఈనెల 19లోగా తీయవలసిన డిడిలను తీయకూడదని నిర్ణయించారు. అంటే ప్రభుత్వానికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉన్నట్లు భావించవచ్చు. ఒకవేళ రేషన్ షాపులు మూతపడితే రాష్ట్రంలో ఆ రేషన్ సరుకులతోనే బ్రతుకుతున్న లక్షలాది నిరుపేద కుటుంబాలు అల్లాడిపోతాయి. కనుక దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవలసి ఉంటుంది. 

వివిధ ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీచేయడానికే ఆపసోపాలు పడుతున్న ప్రభుత్వం ఒకేసారి 17,000 మంది రేషన్ డీలర్లను ఉద్యోగులుగా నియమించడం అసాధ్యమనే చెప్పవచ్చు. ఒకసారి పే-స్కేలు ప్రకటిస్తే ఇక వారు కూడా ప్రతీ ఏటా తమకూ జీతాల పెంచాలని డిమాండ్ చేసే అవకాశాలున్నాయి. అప్పుడు ఇది ప్రభుత్వానికి ఆర్ధికంగా చాలా భారంగా మారుతుంది. అందుకే ప్రభుత్వం వారి ఈ డిమాండ్ కు అంగీకరించడం లేదు. కానీ రేషన్ డీలర్లకు ఆదాయమార్గాన్ని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. మరోపక్క ఈ రేషన్ సరుకులపై లక్షలాది పేదప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు కనుక ఈ వ్యవస్థను నిరంతరాయంగా నడిపించవలసి ఉంటుంది. ప్రభుత్వంపై అధనపు భారం పడకుండా రేషన్ డీలర్లకు ఆదాయమార్గాన్ని కల్పించి రేషన్ షాపులను కొనసాగించడం ప్రభుత్వానికి కత్తిమీద సామువంటిదే.

Related Post