మరీ ఇంత నిర్లక్ష్యమా?

May 11, 2018
img

ఈరోజుల్లో సామాన్య వ్యాపార సంస్థలే నగదు తరలింపుకు అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటుంటాయి. ఇక బ్యాంకులైతే చెప్పకరలేదు. పూర్తిగా సీల్ చేయబడిన వాహనంలో ఇద్దరు గన్ మ్యాన్ లు లేకుండా నగదును ఎప్పుడూ బదిలీ చేయవు. కానీ నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్.బి.ఐ. బ్యాంక్ మేనేజర్ శివకుమార్ ఒక ఓపెన్ ఆటో ట్రాలీలో ఏకంగా రూ.40 కోట్లు నగదును సమీపంలోని గ్రామీణ వికాస్ బ్యాంక్ కు తరలించే ప్రయత్నం చేయడం విశేషం. అంత బారీ స్థాయిలో డబ్బును తరలిస్తున్నప్పుడు కనీసం ఆ నోట్ల కట్టలపై ఎటువంటి పరదాను కప్పలేదు. 

ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం అందుకొన్న సిఐ బాషా, ఎస్.ఐ. చంద్రశేఖర్ తమ పోలీసులతో హుటాహుటిన అక్కడకు చేరుకొని బ్యాంక్ మేనేజర్ ను మందలించారు. అంత డబ్బును వేరే బ్యాంక్ కు తరలిస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా, అందరికీ కనబడేలా తీసుకువెళ్ళడాన్ని వారు తప్పుపట్టారు. అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలి తప్ప ఇటువంటి సాహసం చేయడం సరికాదని మందలించారు. పోలీసులకు బదులు ఎవరైనా దుండగులకు ఈ సమాచారం అంది ఉంటే ఏమయ్యేదని ప్రశ్నించారు. అనంతరం పోలీసులు, సెక్యూరిటీ గార్డుల రక్షణతో ఆ డబ్బును గ్రామీణ వికాస్ బ్యాంక్ కు సురక్షితంగా చేరవేశారు. 


Related Post