మెట్రో కబుర్లు

May 08, 2018
img

హైదరాబాద్ మెట్రో రైళ్ళలో ఉండే మూడు బోగీలలో ఒక బోగీలోని కొంత భాగాన్ని మహిళల కోసం కేటాయించినట్లు మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. అలాగే మధురానగర్ ప్రాంతంలో తరుణి పేరుతో మహిళల కోసమే ఒక ప్రత్యేక మెట్రో స్టేషన్ నుకూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు మెట్రో రైల్ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు. మెట్రో స్టేషన్లలోనే కాకుండా మెట్రో రైళ్ళలో కూడా మహిళలకు భద్రత కోసం సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 

మెట్రో రైళ్ళు కేవలం ప్రయాణసాధనంగా మాత్రమే కాక నగరాభివృద్ధిలో భాగస్వామ్యం వహించే విధంగా మెట్రోను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. నగరంలో పరుగులు తీస్తున్న మెట్రో రైళ్ళు కాలుష్యరహితమైనవి కనుక నగరం పర్యావరణానికి హాని కలిగించకుండా ప్రజలకు సురక్షితంగా, చాలా సౌకర్యవంతంగా ప్రయాణించడానికి తోడ్పడుతున్నాయని అన్నారు. ఈ ఏడాది జూలై చివరిలోగా అమీర్ పేట-ఎల్బి నగర్, అక్టోబర్ నాటికి అమీర్ పేట-హైటెక్ సిటీ కారిడార్ల నిర్మాణ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి ఆ రెండు కారిడార్లలో కూడా మెట్రో రైల్ సర్వీసులను ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే వచ్చే ఏడాదిలో జూబ్లీ బస్ స్టేషన్-మహాత్మాగాంధీ బస్ స్టేషన్లను కలుపుతూ వేస్తున్న మెట్రో లైన్ కూడా ప్రజలకు అందుబాటులోకి రానున్నదని చెప్పారు. ఇక మెట్రో రెండో ఫేజ్ లో శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైల్ సర్వీసులను పొడిగించడానికి సన్నాహాలు మొదలుపెట్టమని మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి తెలిపారు.        


Related Post