వాహనదారులకు శుభవార్త

April 21, 2018
img

దేశంలో చాలా మంది ప్రజలు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఉద్యోగాలు, వ్యాపారాలు లేదా బదిలీలపై వెళుతుంటారు. వారు తమ తమ రాష్ట్రాలలో వాహనాలను కొనుగోలు చేసినప్పుడు వాటికి అక్కడ రోడ్ టాక్స్ చెల్లిస్తారు. కానీ వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు వాటికి మళ్ళీ రోడ్ టాక్స్ చెల్లించవలసివస్తుండేది. ఇకపై ఆవిధంగా చెల్లించనవసరం లేదని కేంద్ర రవాణాశాఖ ప్రకటించింది. 

ఇటీవల గౌహతీలో జరిగిన అన్ని రాష్ట్రాల రవాణాశాఖల మంత్రుల సమావేశంలో దీనిపై చర్చించి ఈమేరకు నిర్ణయం తీసుకొన్నామని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఇకపై దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను విధానం అమలుచేస్తామని తెలిపారు. రోడ్ టాక్స్ ను వాహనాల ధరలను బట్టి మూడు స్లాబ్ లుగా నిర్ణయించామనితెలిపారు. 

రూ.10 లక్షల లోపు ధర కలిగిన వాహనాలకు 8 శాతం, రూ.10 నుంచి 20 లక్షల లోపు వాహనాలకు 10 శాతం, రూ.20 లక్షలు అంతకు మించి ధర కలిగిన వాటికి 12 శాతం రోడ్ టాక్స్ వసూలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. 

ఏకీకృత రోడ్ టాక్స్ ప్రవేశపెట్టాలనుకోవడం హర్షణీయమే. సాధారణంగా మద్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉపయోగించే ద్విచక్ర వాహనాల ధరలు ఒక లక్ష లోపుగానే ఉన్నప్పుడు వాటి కోసం ఒక స్లాబ్ ఏర్పాటు చేయకుండా రూ.10 లక్షలు పెట్టి కార్లు, వాహనాలు కొనుకొనే ఉన్నత తరగతి వర్గంతో సమానంగా రూ.10 లక్షల వరకు ఒక స్లాబ్ పెట్టి, దానికి 8 శాతం పన్ను వసూలు చేయాలనుకోవడమే చాలా అన్యాయంగా ఉంది.

Related Post