ఫార్మా సిటీకి నీమ్జ్ హోదా

April 20, 2018
img

తెలంగాణా రాష్ట్రంలో ఏర్పాటుకాబోతున్న ఫార్మాసిటీ ఆసియాలోకెల్లా అతిపెద్దదిగా నిలువబోతోంది. రంగారెడ్డిజిల్లాలో యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాలలో 19,333.20 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయబోతున్నారు. కేంద్రప్రభుత్వం 2013లో ప్రకటించిన నేషనల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ (నిమ్జ్) పాలసీకి అనుగుణంగా దీనిని ఏర్పాటు చేస్తుండటంతో దీనికి కేంద్రప్రభుత్వం ‘నిమ్జ్’ హోదా కల్పించడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. 

సుమారు రూ.16,784 కోట్లు వ్యయంతో ఏర్పాటు కాబోతున్న ఈ ఫార్మా సిటీలో ఉత్పత్తి ప్రారంభమయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు ఐదున్నర లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాది అవకాశాలు లభిస్తాయి. నిమ్జ్ హోదా లభించినట్లయితే ఫార్మా సిటీ ఏర్పాటుకు కేంద్రం రూ.4,000 కోట్లు నిధులు అందిస్తుంది. కేంద్ర వాణిజ్యశాఖ కూడా బారీగా రుణాలు సమకూరుస్తుంది.

తెలంగాణా రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న ఫార్మా సిటీకి నిమ్జ్ హోదా కల్పించేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య,ఔషధ శాఖలు, పరిశ్రమలు, జాతీయ రహదారుల శాఖలు నివేదికలు ఇవ్వడంతో, కేంద్ర వాణిజ్యశాఖ అధ్వర్యంలో పనిచేసే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌ (డీఐపీపీ) త్వరలోనే ఉత్తర్వులు జారీచేయబోతోందని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టిస్ఐఐసి) అధికారులు తెలిపారు. 

ఇదికాక నీమ్జ్ పాలసీ ప్రకారం జహీరాబాద్ లో సుమారు 12,500 ఎకరాలలో మరొక పెద్ద పారిశ్రామికవాడ వస్తోంది. దీనిలో ఎలక్ట్రిక్ పరికరాలు, ఆటోమొబైల్స్, ట్రాన్స్ పోర్ట్ పరికరాలు, మెటల్స్, ఫుడ్ అండ్ ఆగ్రో ప్రాసెసింగ్ మొదలైన పరిశ్రమలు ఏర్పాటవుతాయి. దీనికి కేంద్రప్రభుత్వం ఇప్పటికే నీమ్జ్ హోదా మంజూరు చేసింది. ఇప్పుడు తాజాగా ఫార్మా సిటీకి కూడా నీమ్జ్ హోదా లభిస్తే, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది.

Related Post