ఒక్కోసారి అదృష్టం అంటే ఇదేనేమో అనిపించే ఘటనలు జరుగుతుంటాయి. నేడు రాఖీ పండుగ సందర్భంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులకు అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసేందుకు లక్కీ డ్రా నిర్వహించింది.
హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలోని లక్ష్మీగూడలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సమక్షంలో అర్హుల పేర్లు చీటీలపై వ్రాసి లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓ తల్లి చేతిలోని పసిపాప చేత చీటీ తీయించారు.
దానిలో ఆ పాప తల్లి పేరే ఉండటంతో ఆమె ఆనందంతో పొంగిపోయింది. ఆమె కుటుంబానికి ఇంత అదృష్టం తెచ్చిపెట్టిన ఆ చిన్నారిని మంత్రి పొంగులేటి కూడా ముద్దుపెట్టుకొని ఆశీర్వదించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నారంటే, “చిన్నపిల్లలు స్వచ్ఛమైన మనసుతో ఉంటారు. ఈ పాప తీసిన చీటీతో తల్లితండ్రులకు అదృష్టం తెచ్చిపెట్టింది. పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న ప్రభుత్వ సంకల్పానికి, ఇది దేవుడి ఆశీస్సులుగా భావిస్తున్నాను,” అని అన్నారు.
నేడు మొదటి విడతలో కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, రాజేంద్రనగర్, నాంపల్లి నియోజకవర్గాల్లో మొత్తం 7,350 మందికి ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించారు. మళ్ళీ మరో పది రోజుల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను విడుదల చేసి, ఇలాగే లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు.
ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో భూసేకరణ, టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ళ రిజిస్ట్రేషన్ కొరకు లబ్ధిదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు.
అంతేకాదు.. లబ్దిదారుల పేరిట ఇళ్ళు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక ప్రభుత్వ జోక్యం ఉండదని, వారు అవసరమనుకుంటే ఇంటిని తాకట్టు పెట్టి అప్పు తీసుకోవచ్చని, పదేళ్ళ తర్వాత ఇంటిని అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని మంత్రి పొంగులేటి చెప్పారు.