గచ్చిబౌలి ట్రిపుల్ ఐటి విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన అనిరుద్ ట్రిపుల్ ఐటిలో కంప్యూటర్ సైన్స్ (రెండో సంవత్సరం) విద్యార్ధిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ప్రాధమిక దర్యాప్తు తర్వాత గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న కారణంగా అనిరుద్ ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
చదువులలో వెనకబడిపోవడం, పరీక్షల ఒత్తిడి, వేధింపులు వంటి కోణాలలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
కానీ సహా విద్యార్ధులు, అధ్యాపకులు, సిబ్బంది, మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ, తల్లితండ్రులు అందరినీ ప్రశ్నించిన తర్వాత అనిరుద్ ఆత్మహత్యకు అసలు కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటిలలో ఏటా ఇలాంటి విషాదాలు జరుగుతుండటం ఆలోచింపజేస్తుంది. గత ప్రభుత్వ హయంలో బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్ధులు దాదాపు వారం రోజుల పాటు తరగతులు బహిష్కరించి ఆవరణలో ఆందోళన చేయడం అప్పుడు మంత్రులు స్వయంగా జోక్యం చేసుకొని వారి సమస్యలను పరిష్కరించాల్సి రావడం బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది.