అతని పేరు టి.క్రాంతి కుమార్. హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకుంటున్నాడు. సుమారు ఏడేళ్ళ క్రితం ఓ శుభకార్యంలో హర్షితా సింగ్ అనే అందమైన అమ్మాయి పరిచయం అయ్యింది. క్రాంతి కుమార్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. ఆమె కూడా ప్రేమిస్తున్నట్లు నటిస్తూ, అవసరమైనప్పుడు డబ్బు అడిగి తీసుకునేది. ఎలాగూ కాబోయే భార్యే కదా అని ఆమె అడిగినంత ఇస్తూ ఉండేవాడు.
అయితే తన తండ్రికి అనారోగ్యమని, చికిత్స కోసం చాలా డబ్బు అవసరమని చెప్పడంతో క్రాంతి కుమార్ ఆమె మాటలు నమ్మి ఇంట్లో ఉన్న బంగారం అమ్మేసి, అందినకాడికి అప్పులు చేసి ఆమెకు రూ.3.5 కోట్లు ఇచ్చాడు.
కానీ ఆమె ఇంకా ఇంకా డబ్బు అడుగుతుండటంతో అనుమానం వచ్చి ఆమె చెప్పిన ఆస్పత్రికి వెళ్ళి చూడగా అక్కడ ఆమె తండ్రి చేరనేలేదని గ్రహించాడు. ఇదే విషయం ఆమెను గట్టిగా నిలదీయడంతో ఆమె భర్త ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారనే విషయం బయటపడింది!
క్రాంతి కుమార్ వారి ఇంటికి వెళ్ళి నిలదీయగా ఆమె కుటుంబ సభ్యులు డాక్టర్ శైలేందర్ సింగ్, లాజ్వంతీ సింగ్ తదితరులు అతనిని బెదిరించారు. ఈ వరుస షాకులని తట్టుకోలేక క్రాంతి కుమార్ రెండేళ్ళ క్రితం ఆత్మహత్యాయత్నం చేశాడు కూడా. అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు.
బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సూచన మేరకు హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్‌లో హర్షితా సింగ్, ఆమె కుటుంబ సభ్యులపై పిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.