కాళేశ్వరం కేసు జనవరికి వాయిదా

November 12, 2025


img

నేడు కాళేశ్వరం కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు, ఈ కేసుని జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. ఆలోగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని, దాని ఆధారంగా కేసీఆర్‌, హరీష్ రావు స్మితా సభర్వాల్ ముగ్గురూ మూడు వారాలలో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతవరకు మాజీ సిఎం కేసీఆర్‌, మాజీ హరీష్ రావు, ఐఏఎస్‌ అధికారిని స్మితా సభర్వాల్ ముగ్గురిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవద్దని గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.  

జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్‌ నివేదిక ఇచ్చి ఇప్పటికే రెండు నెలలయ్యింది. దాని ఆధారంగా తమపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ మాజీ సిఎం కేసీఆర్‌, మాజీ హరీష్ రావు, ఐఏఎస్‌ అధికారిని స్మితా సభర్వాల్ వేర్వేరుగా ఇదివరకే హైకోర్టులో పిటిషన్లు వేశారు.

వాటిపై  హైకోర్టు సానుకూలంగా స్పందిస్తూ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కేసునే నేడు విచారణ చేపట్టి జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని నేషనల్ డ్యామ్‌ సేఫ్టీ అధారిటీ నిపుణుల బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ వ్రాసి రెండు నెలలు పైనే అయ్యింది. కానీ ఇంతవరకు కేంద్రం స్పందించలేదు. హైకోర్టులో ఈ కేసు వాయిదాలు పడుతూనే ఉంది. కనుక ఇది ఎప్పటికి పూర్తవుతుందో ఎవరూ చెప్పలేరు. 


Related Post