సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (బిఆర్ గవాయ్) బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, మరికొందరు ముఖ్య అతిధులు హాజరయ్యారు.
జస్టిస్ గవాయ్ మహారాష్ట్రలోని అమరావతికి చెందినవారు. 1985లో న్యాయవాద వృత్తిలో ప్రవేశించి 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దాదాపు ఏడాది తర్వాత అదే హైకోర్టు శాశ్విత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
జస్టిస్ గవాయ్ గత ఆరేళ్ళ కాలంలో దాదాపు 700 ధర్మాసనాలలో న్యాయమూర్తిగా వ్యవహరించి రాజ్యాంగపరమైన, వాణిజ్య, పర్యావరణ, విద్య, విద్యుత్, సివిల్, క్రిమినల్ కేసులని విచారించారు.
జస్టిస్ గవాయ్ 2019, మే 24 నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఈ పదవిలో ఆయన మరో ఆరు నెలలు అంటే నవంబర్ 23 వరకు మాత్రమే పనిచేసి పదవీ విరమణ చేయనున్నారు.