ఈ నెల 23 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు గవర్నర్ పేరిట రాజ్‌భవన్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూలై 23 నుంచి శాసనసభ, 24 నుంచి మండలి సమావేశాలు మొదలవుతాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
రోడ్డు ప్రమాదంలో మరణించిన బిఆర్ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు మొదటి రోజున సంతాపం తెలుపుతారు. జూలై 24న ఉభయ సభలను ఉద్దేశ్యించి గవర్నర్ ప్రసంగిస్తారు.
ఈ నెల 23న కేంద్ర ఆర్ధికమంత్రి పార్లమెంట్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. దానిలో రాష్ట్రాలకు కేటాయించిన నిధులు, ప్రాజెక్టులను బట్టి రాష్ట్ర బడ్జెట్‌కు తుది రూపం ఇస్తారు. తొలిసారిగా ఆర్ధికమంత్రి హోదాలో భట్టి విక్రమార్క జూలై 25వ తేదీన 2024-25 ఆర్ధిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో శాసనసభ సమావేశాలు నిర్వహించి జూలై నెలాఖరు వరకు ఒతాన్ బడ్జెట్ కింద రూ.2.75 లక్షల కోట్లు ఆమోదించింది. కనుక ఆ గడువు ముగిసేలోగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టవలసి ఉంటుంది.
ఈసారి బడ్జెట్ సమావేశాలలో రైతు భరోసా, జాబ్ క్యాలండర్, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు, తెలంగాణ తల్లి, రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రలో మార్పులు చేర్పులు తదితర అంశాలపై కూడా చర్చించి ఆమోదించే అవకాశం ఉంది.