కాంగ్రెస్‌ నేతలు కడియం ఇంటికి… నేడో రేపో జంప్!

March 29, 2024


img

మాజీ మంత్రి, స్టేషన్‌ ఘన్‌పూర్‌ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం దాదాపు ఖరారు అయ్యింది. ఆమె నిన్న రాత్రి వరంగల్‌ నుంచి తాను బిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు కేసీఆర్‌కు లేఖ ద్వారా తెలియజేసిన వెంటనే కాంగ్రెస్‌ నేతలు వారితో ఫోన్లో మాట్లాడారు. 

నిజానికి కాంగ్రెస్‌ పార్టీ కడియం శ్రీహరి కూతురు కావ్యకి వరంగల్‌ టికెట్‌ ఆఫర్ చేస్తున్నందునే వారు బిఆర్ఎస్ టికెట్‌ తిరస్కరించిన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, కాంగ్రెస్‌ నేతలు మల్లు రవి, సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి హైదరాబాద్‌లోని కడియం నివాసానికి వెళ్ళి వారితో సుమారు ముప్పావు గంటసేపు చర్చించారు. 

అనంతరం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ నేతలు నన్ను వారి పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించడానికి మా ఇంటికి వచ్చారు. నేను నా అనుచరులతో చర్చించిన తర్వాత నా నిర్ణయం తెలియజేస్తామని చెప్పాను,” అని అన్నారు. అంటే కాంగ్రెస్‌లో చేరడం ఖాయమే కానీ ఎప్పుడు చేరుతారో చెప్పాల్సి ఉంది. 

ప్రస్తుతం కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు కనుక ఆయనను కాంగ్రెస్‌ అభ్యర్ధిగా లోక్‌సభకు పోటీ చేయించడం కంటే ఆయన కూతురు కావ్యని పోటీ చేయించి గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఒకేసారి ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే లభిస్తారు. వారిరువురూ కాంగ్రెస్ పార్టీలో చేరగానే కాంగ్రెస్ పార్టీ వరంగల్‌తో సహా మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉంది.


Related Post