తెలంగాణకు మరో నలుగురు ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్‌

March 28, 2024


img

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, లోక్‌సభ ఎన్నికలలో విజయావకాశాలు ఎక్కువగా ఉండటంతో ఈసారి ఎంపీ సీట్ల కోసం పార్టీలో చాలా మంది పోటీ పడుతున్నారు. కనుక కాంగ్రెస్‌ అధిష్టానం అభ్యర్ధులను ఖరారు చేయడంలో చాలా ఒత్తిడి ఎదుర్కుంటోంది. 

బుధవారం సాయంత్రం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. దీనిలో సిఎం రేవంత్‌ రెడ్డి, డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ పాల్గొని సుదీర్గంగా చర్చించి నలుగురు అభ్యర్ధులను ఖరారు చేశారు. 

మెదక్: నీలం మధు, భువనగిరి: చామల కిరణ్ కుమార్‌ రెడ్డి, నిజామాబాద్‌: తాటిపర్తి జీవన్ రెడ్డి, ఆదిలాబాద్: ఆత్రం సుగుణలను కాంగ్రెస్‌ అభ్యర్ధులుగా పోటీ చేయబోతున్నారని ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం రాత్రి ప్రకటించారు. 

దీంతో మొత్తం 17 స్థానాలకు 13 మంది అభ్యర్ధులను ప్రకటించిన్నట్లయింది. ఇంకా వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌లకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. 

 వరంగల్‌ నుంచి దొమ్మాట సాంబయ్య లేదా నమ్మిళ్ళ శ్రీనివాస్, కరీంనగర్‌ నుంచి ప్రవీణ్ రెడ్డి లేదా రాజేందర్ రావు లేదా తీన్మార్ మల్లన్న పేర్లు పరిశీలనలో ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి మజ్లీస్‌ అభ్యర్ధిగా మళ్ళీ అసదుద్దీన్‌  ఓవైసీ పోటీ చేయబోతున్నారు. మజ్లీస్‌ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్‌కు దగ్గరైనందున హైదరాబాద్‌ అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్‌ ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. 

ఖమ్మం సీటు కోసం భట్టి విక్రమార్క తన భార్య నందినికి ఇవ్వాలని కోరుతుండగా, మంత్రి పొంగులేటి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి, మరో మంత్రి తుమ్మల తన కుమారుడు యుగంధర్‌కు ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్‌ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమకుమార్, పారిశ్రామికవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సీటు కోసం పట్టుబడుతున్నారు. 

ఈ నెల 31వ తేదీన మరోసారి సమావేశమయ్యి మిగిలిన నాలుగు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాలని నిర్ణయించారు.


Related Post