పదేళ్ళ నిజం బిఆర్ఎస్... వంద రోజుల అబద్దాలు కాంగ్రెస్‌: కేటీఆర్‌

March 27, 2024


img

బిఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బుధవారం చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో, పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “పదేళ్ళ నిజం బిఆర్ఎస్‌ పార్టీ. పదేళ్ళ విషం బీజేపీ… వందరోజుల అబద్దాలు కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికలు ఈ మూడు పార్టీలు, వాటి విధానాల మద్యన జరుగుతున్నవే తప్ప వ్యక్తుల మద్య కాదు. పదేళ్ళ బిఆర్ఎస్‌ పాలనలో తెలంగాణలో త్రాగు,సాగు నీటి కొరత, కరెంట్ కొరత ఉండేవి కావు. 

కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వందరోజులలోనే ప్రజలకు నీటి కష్టాలు, కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికలలో నోటికి వచ్చిన్నట్లు హామీలు ఇచ్చేసి, అబద్దాలు, మాయమాటలు చెప్పి, బిఆర్ఎస్‌ గురించి దుష్ప్రచారం చేసి గెలిచి అధికారంలోకి వచ్చింది. కనీసం ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందా అంటే అదీ లేదు.

రెండు లక్షల పంట రుణ మాఫీలు లేదు. రైతుబంధు లేదు. మహాలక్ష్మి పధకంలో మహిళలకు నెలకు రూ.2,500 పింఛన్ ఇస్తామన్నారు అదీ లేదు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయకుండా మోసం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. రేవంత్‌ రెడ్డి తమని మోసం చేశారని రైతులు రగిలిపోతున్నారు. మరోపక్క మహిళలు, నిరుద్యోగులు కోపంగా ఉన్నారు. 

బీజేపీ గత పదేళ్ళుగా తెలంగాణ మీద విషం కక్కడమే తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదు. కనుక లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌, బీజేపీలలో దేనికి ఓట్లు వేసినా నష్టపోయేది ప్రజలే. దయచేసి బిఆర్ఎస్‌ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని అందరినీ కోరుతున్నాను. అప్పుడే ఆ రెండు పార్టీలకు కనువిప్పు కలుగుతుంది,” అని అన్నారు.


Related Post