హైకోర్టు కొత్త భవనాలకు నేడే శంకుస్థాపన

March 27, 2024


img

రంగారెడ్డి జిల్లా, రాజేంద్ర నగర్‌లో 100 ఎలరాల విస్తీర్ణంలో తెలంగాణ హైకోర్టు నూతన భవన సముదాయ నిర్మాణానికి బుధవారం సాయంత్రం 5.30 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ శంకుస్థాపన చేస్తారు. 

ప్రస్తుతం మూసీ నది ఒడ్డున ఉన్న హైకోర్టు 1919లో నిర్మించినది కావడంతో నిత్యం మరమత్తులు చేయవలసి వస్తోంది. కనుక ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్‌ అరాధే సిఎం రేవంత్‌ రెడ్డిని కలిసినప్పుడు పరిస్థితి వివరించి, తెలంగాణ హైకోర్టుకు నూతన భవనాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. 

సిఎం రేవంత్‌ రెడ్డి వెంటనే సానుకూలంగా స్పందిస్తూ, రాజేంద్ర నగర్‌లో వ్యవసాయ యూనివర్శిటీకి చెందిన భూములలో 100 ఎకరాలను హైకోర్టుకి కేటాయించారు. అక్కడే నేడు శంకుస్థాపన జరుగబోతోంది. 

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సిఎం రేవంత్‌ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఎవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయవాదులు, సంబందిత శాఖల ఉన్నతాధికారులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. 

హైకోర్టుకు కేటాయించిన 100 ఏకరాలలోనే ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి నివాస సముదాయాలు, హైకోర్టులో వివిద విభాగాలకు వేర్వేరుగా భవనాలు, సువిశాలమైన అంతర్గత రోడ్లు, పార్కింగ్, అత్యాధునిక లైటింగ్ తదితర అన్ని సదుపాయాలతో హైకోర్టు భవనాలను నిర్మించబోతున్నారు. దీని కోసం హైకోర్టు బిల్డింగ్ కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంది. 

హైకోర్టు భవనాలకు డిజైన్ చేసేందుకు టెండర్లు ఆహ్వానించగా 19 ఆర్కిటెక్ట్ కంపెనీలు ముందుకు వచ్చాయి. ప్రభుత్వం వాటిలో ఒకటి రెండు కంపెనీలను ఎంపిక చేసి అవి సమర్పించే హైకోర్టు డిజైన్లను ఈ కమిటీకి అప్పగిస్తుంది. వాటిలో ఒక దానిని కమిటీ ఎంపిక చేసుకొని ప్రభుత్వానికి తెలియజేయగానే హైకోర్టు నిర్మాణానికి టెండర్లు పిలుస్తుంది. 

పనులు ప్రారంభించినప్పటి నుంచి 18 నెలల్లో నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి హైకోర్టుకి అప్పగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. 


Related Post