కడిగిన ముత్యంలా బయటకు వస్తా: కల్వకుంట్ల కవిత

March 26, 2024


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్టయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టులో నేడు ప్రవేశపెట్టారు. 

ఈడీ న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదిస్తూ, ఈ కేసులో ఇంకా ఆమెను విచారిస్తున్నందున రెండు వారాలు జ్యూడిషియల్ రిమాండ్‌ విదించాలని కోరారు. ఆమె తరపు న్యాయవాది, ప్రస్తుతం కల్వకుంట్ల కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూల్ విడుదలైందని, కనుక తల్లిగా ఆమె బాధ్యత నిర్వర్తించేందుకు ఆమెకు ఏప్రిల్‌ 16వరకు మద్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు.

ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ 9 వరకు 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు తీర్పు చెప్పారు. ఢిల్లీ పోలీసులు ఆమెను తిహార్ జైలుకి తరలించారు.  

అంతకు ముందు ఆమె పోలీసుల బందోబస్తు మద్య కోర్టులో ప్రవేశిస్తుండగా అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులను చూసి,  “జై తెలంగాణ... జై కేసీఆర్‌,” అని నినాదాలు చేస్తూ, “ఇది మనీ లాండరింగ్ కేసు కాదు పొలిటికల్ లాండరింగ్ కేసు. దీనిలో ఇప్పుడు నన్ను జైలుకి పంపినా నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తాను. జైల్లో పెట్టినా నా ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బ తీయలేరు. ఇప్పటికే ఈ కేసులో ఓ నిందితుడు బీజేపీలో చేరాడు. మరొక నిందితుడికి బీజేపీ టికెట్‌ కూడా ఇస్తోంది. మూడో నిందితుడు బీజేపీకి రూ.50 కోట్లు బాండ్ల రూపంలో లంచం సమర్పించుకొని ఈ కేసుల నుంచి విముక్తి పొందాడు,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.


Related Post