భూకబ్జా కేసులో బిఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి

March 24, 2024


img

అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసినా చెల్లుతుంది. కానీ అధికారం కోల్పోతే చేసిన తప్పులు, పాపాలన్నిటికీ మూల్యం చెల్లించక తప్పదు. మాజీ సిఎం కేసీఆర్‌ బంధువు, అత్యంత సన్నిహితుడు, మాజీ బిఆర్ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ పరిస్థితి కూడా ఇదే ఇప్పుడు. 

రాష్ట్రంలో బిఆర్ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బంజారాహిల్స్‌లో కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేసినప్పుడు ఎవరూ ప్రశ్నించలేకపోయారు. కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. 

బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం నవయుగ కంపెనీ బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 14లో సర్వే నంబర్: 129/54లో 1350 చదరపు గజాల స్థలం కొనుగోలు చేసింది. దానిని జోగినపల్లి సంతోష్ కుమార్‌, లింగారెడ్డి కలిసి కబ్జాకు ప్రయత్నించారంటూ నవయుగ ప్రతినిధి చింతా మాధవ్ మార్చి 21వ తేదీన ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు జోగినపల్లి సంతోష్ కుమార్‌, లింగారెడ్డి ఇద్దరిపై సెక్షన్స్: 400,471, 447,120బి రెడ్ విత్ 34 ఐపిసీ కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ అనేక సమస్యలతో సతమతమవుతోంది. ఇప్పుడు పార్టీలో సీనియర్ నేత, కేసీఆర్‌ సన్నిహితుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌పై ఈ భూకబ్జా కేసు నమోదు కావడం ఇంకా ఇబ్బందికరంగా మారవచ్చు.


Related Post