అర్వింద్ కేజ్రీవాల్‌ జైలు నుంచి పరిపాలన చేయగలరా?

March 24, 2024


img

లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం ఈడీ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌, శనివారం అక్కడి నుంచే తన జలవనరుల శాఖ మంత్రికి ఆదేశాలు జారీ చేశారు. నగరంలో కొన్ని ప్రాంతాలలో త్రాగునీరు, డ్రైనేజీ సమస్యలను తక్షణం పరిష్కరించాలని అర్వింద్ కేజ్రీవాల్‌ ఆదేశించారని మంత్రి అతిషి మీడియాకు తెలియజేశారు. 

ఈడీ అధికారులు అరెస్ట్ చేసినా కూడా అర్వింద్ కేజ్రీవాల్‌ తన గురించి కాక ఢిల్లీ ప్రజల సమస్యల గురించే ఆలోచిస్తున్నారని తెలిసి చలించిపోయానని అన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నా ముఖ్యమంత్రే... ఆయన ఎక్కడ నుంచి ఆదేశాలు జారీ చేసినా వాటిని తామందరం తూచా తప్పకుండా పాటిస్తామని మంత్రి అతిషి తెలిపారు.

అర్వింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు అరెస్ట్ చేయగానే ఆయన తన పదవికి రాజీనామా చేస్తారని అందరూ భావించారు. కానీ ఆయన రాజీనామా చేస్తే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఒత్తిళ్ళను తట్టుకొంటూ పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించగల సమర్ధులు లేకపోవడం వలననే అర్వింద్ కేజ్రీవాల్‌ రాజీనామా చేయలేదని తెలుస్తోంది. 

ఇదివరకు దాణా కుంభకోణం కేసులో బిహార్‌ సిఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ అరెస్ట్ అయినప్పుడు ఆయన తన భార్య రబ్రీదేవిని సిఎం చేసి అధికారం తన చేతిలో నుంచి జారిపోకుండా జాగ్రత్త పడ్డారు. కానీ అర్వింద్ కేజ్రీవాల్‌ తన సిఎం పదవికి రాజీనామా చేయలేదు.   

సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ నిరాకరించినందున రేపు కస్టడీ ముగిసి తిహార్ జైలుకి వెళ్ళవలసిరావచ్చు. అప్పుడు జైలు నుంచి ఏవిదంగా పరిపాలన కొనసాగిస్తారు? అధికారులు ప్రతీ రోజూ తిహార్ జైలుకి వెళ్ళేందుకు ఇష్టపడతారా లేదా?అనేది రాబోయే రోజుల్లో చూడవచ్చు.


Related Post