జూన్ 8న కాంగ్రెస్‌లోకి జూపల్లి... ఒక్కరేనా?

May 30, 2023


img

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇద్దరినీ పార్టీలోకి రప్పించుకొనేందుకు కాంగ్రెస్‌, బిజెపిలు గట్టిగా ప్రయత్నించాయి. వారి కోసం ఈటల రాజేందర్‌ ఢిల్లీ వెళ్ళి బిజెపి పెద్దలతో మాట్లాడివచ్చి మళ్ళీ వారితో చర్చించారు. అయితే వారిద్దరినీ బిజెపిలోకి రప్పించలేకపోతున్నానని ఈటల రాజేందర్‌ ఒప్పేసుకొన్నారు. 

దీంతో వారిరువురూ కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ వారిలో జూపల్లి ఒక్కరే జూన్ 8వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఖమ్మంలో అన్ని సీట్లు తన అనుచరులకే ఇవ్వాలని పట్టుబడుతున్నందున ఆఊయమ ఇంకా కాంగ్రెస్ పార్టీకి గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడం లేదు. 

జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నుంచి తనకు, వనపర్తి నుంచి ఎంపీ మేఘారెడ్డికి టికెట్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో కొల్లాపూర్‌ నుంచి అభిలాష్ రావు, జగదీశ్వర్ రావు టికెట్‌ ఆశిస్తుండగా వనపర్తిలో సీనియర్ నేత చిన్నారెడ్డి, శివసేనా రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. 

కనుక వారు జూపల్లి, మేఘారెడ్డి చేరికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో జూపల్లి వర్గానికి చాలా బలం ఉన్నందున ఆయనను ఎలాగైనా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. కనుక ఒకవేళ జూన్ 8న జూపల్లి వర్గీయులు  కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లయితే, కాంగ్రెస్‌లో సీనియర్ నేతలను పక్కన పెడుతున్నట్లే భావించాల్సి ఉంటుంది లేదా జూపల్లి, మేఘారెడ్డిలను వేరే నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు ఒప్పించి ఉండవచ్చు. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కధ ఇంకా ముగింపుకు చేరుకోలేదు. ఆయన ఏమి చేయబోతున్నారో తెలియవలసి ఉంది.


Related Post