టిఎస్‌పీఎస్సీ స్కామ్‌లో మరో ఇద్దరు... అంతులేదా?

May 29, 2023


img

టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ స్కామ్‌లో విచారణ జరుపుతున్న సిట్‌ పోలీసులు ఈ కేసులో మరో ఇద్దరిని నిన్న అరెస్ట్‌ చేశారు. వారిలో రమేష్ అనే వ్యక్తి వరంగల్‌ విద్యుత్‌ శాఖలో ఏఈగా పనిచేస్తుండగా, నర్సింగరావు అనే మరో వ్యక్తి విప్రోలో మేనేజరుగా పనిచేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ తన స్నేహితుడైన నర్సింగరావుకు ఏఈఈ ప్రశ్నాపత్రాన్ని ఇవ్వగా, అతను దానిని రవి కిషోర్ అనే వ్యక్తికి ఇచ్చాడు. అతని వద్ద నుంచి రమేష్ ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసిన్నట్లు పోలీసులు గుర్తించి ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్‌ అయిన వారి సంఖ్య 46కి చేరింది.

ఇంకా విచారణ కొనసాగుతున్నందున, ఈ కేసులో ఇంకా ఎంతమంది అరెస్ట్‌ అవుతారో, ఈ కేసు విచారణ ఇంకా ఎప్పటికీ పూర్తవుతుందో తెలీని పరిస్థితి నెలకొంది. అయితే ఈ అరెస్టులతో సరిపెడితే సరిపోదు. అరెస్టయిన వారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ టిఎస్‌పీఎస్సీ విశ్వసనీయత దెబ్బతింటూనే ఉంటుంది. కనుక దాని విశ్వసనీయతను కాపాడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. కనుక సిట్‌ దర్యాప్తును వీలైనంత త్వరగా ముగించడం చాలా అవసరం.   

ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడటంతో తీవ్ర అప్రదిష్టపాలైన టిఎస్‌పీఎస్సీలో మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వమూ, టిఎస్‌పీఎస్సీ తగిన జాగ్రత్తలు తీసుకొని, వాటి గురించి ప్రజలకు వివరించడం కూడా చాలా అవసరం. లేకుంటే పరీక్షల నిర్వహణపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉంటాయి. 


Related Post