ప్రకృతి విపత్తుల కంటే ప్రతిపక్షాలే ప్రమాదకరం

May 29, 2023


img

రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ఆదివారం కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ పదేళ్ళలో కేసీఆర్‌ నాయకత్వంలో అందరం కలిసి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసుకొన్నాము. దశాబ్ధాల కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణలో వ్యవసాయం, సాగునీరు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి లేకపోవడంతో తెలంగాణవాసులు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వలసలు పోయేవారు. కానీ ఈ పదేళ్ళ కేసీఆర్‌ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా అనేక సాగునీటి ప్రాజెక్టులు కట్టించి, రైతన్నలకు అనేక సంక్షేమ పధకాలు అందింస్తున్నాము. రాష్ట్రంలో భారీగా పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు తీసుకువస్తున్నాము. భారీగా ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేస్తున్నాము. తెలంగాణలో వ్యవసాయం, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరగడంతో ఆనాడు వలసలు పోయినవారందరూ తెలంగాణకు తిరిగివస్తున్నారు. ఇదే కాంగ్రెస్‌, కేసీఆర్‌ పాలనకు మద్య తేడా. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా?” అని ప్రశ్నించారు.  

కాంగ్రెస్‌, బిజెపిల గురించి మాట్లాడుతూ, “కర్ణాటక ఎన్నికలలో ఆ రాష్ట్ర ప్రజలు బిజెపిని ఓడించారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు కూడా అదే చేయబోతున్నారు. తెలంగాణలో బిజెపికి డిపాజిట్లు కూడా దక్కవు. కాంగ్రెస్‌, బిజెపిల వలన రాష్ట్రానికి, దేశానికి ఒరిగేదేమీ ఉండదు. ఆ రెండు పార్టీలు సమస్యలు సృష్టించగలవు కానీ పరిష్కరించలేవు. ఆ రెండు పార్టీలు ప్రకృతి విపత్తుల కంటే ప్రమాదకరమైనవి. సిఎం కేసీఆర్‌ తెలంగాణ ఆత్మగౌరవాన్ని పునరుద్దరించి, తెలంగాణ గొప్పదనాన్ని లోకం గుర్తించేలా చేస్తుంటే, బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు తెలంగాణ ప్రతిష్ట దెబ్బతీస్తున్నాయి. కనుక తెలంగాణలో ఆ రెండు పార్టీలకు స్థానం లేదు,” అని మంత్రి హరీష్‌ రావు అన్నారు. 



Related Post