హుజురాబాద్‌లో బిఆర్ఎస్‌, బిజెపి దోస్తీ భళా!

February 03, 2023


img

ఓ పక్క సిఎం కేసీఆర్‌ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై పోరాడేందుకు జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తుంటే, హుజురాబాద్‌లో బిఆర్ఎస్‌, బిజెపి కౌన్సిలర్ల మద్య దోస్తీ కుదరడం చాలా విచిత్రం. అదీ... అదికార పార్టీకి చెందిన మునిసిపల్ ఛైర్ పర్సన్‌ గందే రాధికపై అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దించేందుకు కావడం ఇంకా విశేషం. 

బిఆర్ఎస్‌కి చెందిన 22 మంది, ముగ్గురు బిజెపి కౌన్సిలర్లు కలిసి ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్‌ ఏవో నారాయణకి వినతిపత్రం ఇచ్చారు. ఇంతకీ వారి దోస్తీకి, ఆమెపైఓ అవిశ్వాసం కలగడానికి కారణం ఏమిటంటే, ఆమె భర్త గందే శ్రీనివాస్ మున్సిపాలిటీలో అంతా తానై చక్రం తిప్పుతూ, వారికి దక్కాల్సిన కాంట్రాక్ట్ పనులను తన బినామీలకి కట్టబెట్టి చేయించుకొంటుండటమే! ఛైర్ పర్సన్‌గారి మొగుడినంటూ అధికారులపై కూడా పెత్తనం చేస్తూ అందరినీ తన గుప్పెట్లో పెట్టుకొని పనులు చేయించుకొంటున్నారట! 

గతంలో కూడా గందే శ్రీనివాస్‌ జోక్యాన్ని ఖండిస్తూ కౌన్సిలర్లు మంత్రులకి పిర్యాదులు చేయగా, వారు ఆయనని మందలించడంతో కొన్ని రోజులు వెనక్కి తగ్గి మళ్ళీ పెత్తనం చలాయిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఆయన భార్య ఛైర్ పర్సన్‌గా ఉనందునే పెత్తనం చలాయిస్తున్నారు కనుక ముందు ఆమెని ఆ కుర్చీలో నుంచి దించేయాలని బిఆర్ఎస్‌, బిజెపి కౌన్సిలర్లు నిర్ణయించుకొన్నారు. కలెక్టర్‌ ఆమోదం లభించగానే ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్దం అవుతున్నారు. 

ఆమెని ఆ కుర్చీలో నుంచి దించేస్తే దానిలో కూర్చోనేందుకు అప్పుడే ముగ్గురు సిద్దంగా ఉన్నారు. వైస్ ఛైర్ పర్సన్‌ కొల్లిపాక నిర్మల, కౌన్సిలర్లు దండ శోభ, మందా ఉమాదేవి పోటీ పడుతున్నారు.      



Related Post