వైఎస్ షర్మిల పాదయాత్ర... విమర్శలు మళ్ళీ షురూ!

January 27, 2023


img

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వరంగల్‌ జిల్లాలో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేసుకొనేందుకు కమీషనర్ రంగనాధ్ షరతులతో అనుమతించారు. గత ఏడాది నవంబర్‌ 28న నర్సంపేట నియోజక వర్గం శంకరమ్మ తాండా వద్ద పాదయాత్ర నిలిపివేశారు. కనుక ఫిభ్రవరి 2న అక్కడి నుంచే వైఎస్ షర్మిల పాదయాత్ర మొదలుపెట్టాలని నిర్ణయించుకొన్నారు. 

అక్కడి నుంచి పర్వతగిరి, వర్ధన్నపేట, వరంగల్‌, హనుమకొండ, కాజీపేట, ఘన్‌పూర్‌, జనగామ మీదుగా పాలకుర్తి మండలంలోని దరిదేపల్లి వరకు పాదయాత్రకి అనుమతి లభించింది. ఫిభ్రవరి 18న  ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పాదయాత్ర ముగుస్తుంది. షరతులలో ప్రధానం రాజకీయ ప్రత్యర్ధులని ఉద్దేశ్యించి రెచ్చోగొట్టే మాటలు, ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు, వాటి ఉద్యోగులకి ఎటువంటి ఆటంకాలు కలిగించకూడదు. బాణాసంచా కాల్చరాదు. సాయంత్రం 7 గంటలకి పాదయాత్ర నిలిపివేయాలని కమీషనర్ షరతులు విధించారు.

వైఎస్ షర్మిల 4,000 కిమీ ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఇప్పటికే 3,512 కిమీ పూర్తి చేశారు. కనుక మార్చిలోగా పాదయాత్ర పూర్తి చేసి పాలేరులో ముగింపు సభ నిర్వహించబోతున్నారు. 

రాజకీయ ప్రత్యర్దులని కించపరిచే విదంగా మాట్లాడవద్దని పోలీస్ కమీషనర్ షరతు విధించినప్పటికీ, ఆమె తప్పకుండా కేసీఆర్‌ని, మంత్రులని టార్గెట్ చేసుకొని తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించడం ఖాయమే. అప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ధీటుగా స్పందించడం ఖాయమే.


Related Post