ఏదో ఫ్లోలో అలా అనేశాను... అక్కినేని అంటే నాకు చాలా గౌరవం!

January 26, 2023


img

వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో బాలకృష్ణ అక్కినేని...తొక్కినేని... ఆ రంగారావు... ఈ రంగారావు అంటూ మాట్లాడటంపై అక్కినేని నాగ చైతన్య, అఖిల్‌తో సహా ప్రజలు కూడా తప్పు పడుతున్నారు. ఇక ఆయన టిడిపికి చెందినవారు కావడంతో వైసీపీ నేతలు కూడా ఆయన వ్యాఖ్యలని తప్పు పడుతున్నారు. ఈరోజు బాలకృష్ణ హిందూపురంలో పర్యటించినప్పుడు, విలేఖరులు ఇదే విషయంపై ప్రశ్నించగా, ఏదో ఫ్లోలో అలా అనేశాను కానీ అక్కినేని నాగేశ్వరారావుగారిని కించపరచాలనే ఉద్దేశ్యం నాకు ఏమాత్రం లేదు. అక్కినేని నాగేశ్వరారావుగారిని నేను బాబాయ్ అని పిలిచేవాడిని. ఆయన అంటే నాకు చాలా గౌరవం, గుండెల నిండా ప్రేమ ఉంది. పొగడ్తలకి దూరంగా ఉండాలనే విషయం ఆయన వద్ద నుంచే నేను నేర్చుకొన్నాను. నేను ఏదో ఫ్లోలో అన్న మాటలకి పెడర్ధాలు తీసి దుష్ప్రచారం చేస్తే అందుకు నేను బాధ్యుడిని కాను,” అని అన్నారు. 

అయితే ఫ్లోలో అయినా అక్కినేని గురించి నోరుజారి తప్పుగా మాట్లాడానని ఒప్పుకొని బాలకృష్ణ పశ్చాత్తాపం వ్యక్తం చేసి ఉంటే చాలా హుందాగా ఉండేది. ఈ సమస్య ఇక్కడితో సమసిపోయేది. కానీ నేను ఏదో ఫ్లోలో అన్న మాటలకి పెడర్ధాలు తీసి దుష్ప్రచారం చేస్తే అందుకు నేను బాధ్యుడిని కాను అని బాలకృష్ణ సమర్ధించుకోవడం వలన అక్కినేనిపై ఆయన తన మనసులో ఉన్న చులకనభావాన్నే అప్రయత్నంగా బయటపెట్టుకొన్నారని భావించాల్సి ఉంటుంది. 


Related Post