బిఆర్ఎస్‌లో అవమానాలే తప్ప ఆదరణ దొరకలేదు

January 24, 2023


img

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి తన పార్టీపై, అధినేత కేటీఆర్‌పై తిరుగుబాటు స్వరం వినిపించారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో తన అనుచరులని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నాలుగేళ్ళుగా బిఆర్ఎస్‌ పార్టీలో ఉన్నాము. ఏనాడూ పదవుల కోసం ప్రాకులాడలేదు కానీ కనీసం గౌరవమర్యాదలు కూడా లభించలేదు. అడుగడుగునా అవమానాలే భరించాము. అయినా అన్నిటినీ మౌనంగా సహిస్తూవచ్చాము. ఆనాడు వైసీపీలో ఉన్నప్పుడు ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలని గెలిపించుకొన్నాము. 2014 ఎన్నికలలో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందనే భయంతో టిఆర్ఎస్‌ నేతలు మన దగ్గరకి వస్తే వైసీపీని వీడి టిఆర్ఎస్‌లో చేరాము. కానీ 2018 ఎన్నికలలో మనెవరికీ కేసీఆర్‌ టికెట్లు ఇవ్వలేదు. అందుకు వారే ఫలితం అనుభవించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకేఒక ఎమ్మెల్యే గెలవగలిగారు. 

ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికలలో నాకు టికెట్‌ ఇవ్వలేదు. అప్పుడు నన్ను స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలని మీరందరూ ఎంతగా ఒత్తిడి చేసినా నేను పార్టీకి, కేసీఆర్‌ నాయకత్వానికి కట్టుబడి పోటీ చేయలేదు. కానీ కేసీఆర్‌ ఇచ్చిన ఏ హామీని ఇంతవరకు అమలుచేయలేదు. తాను ముఖ్యమంత్రి కాగానే ఇక్కడికి వచ్చి కుర్చీవేసుకొని కూర్చొని పోడు భూముల సమస్యని పరిష్కరిస్తానని కేసీఆర్‌ అన్నారు. ఏమైంది?ఇంకా ఈ అవమానాలు భరించే శక్తి, సహనం రెండూ నాకు లేవు. కనుక మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి బిఆర్ఎస్‌తో తాడోపేడో తేల్చుకొందాము. 

బిఆర్ఎస్‌లో ఉన్న మనవాళ్లు అనేకమంది వచ్చి మనతో కూర్చొని మాట్లాడుకోవాలని ఎదురుచూస్తున్నారు కానీ పార్టీ ఒత్తిళ్ళ కారణంగా ఎవరూ బయటపడటం లేదు. కానీ పొద్దుగూకిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుకోక తప్పదు. ఈ బిఆర్ఎస్‌ ప్రభుత్వం మహా అయితే మరో 2-3 నెలలు మాత్రమే అధికారంలో ఉంటుంది. ఆ తర్వాత అందరం ప్రజాక్షేత్రంలో తేల్చుకోకతప్పదు. అప్పుడు ప్రజలే ఎవరు తమవారో ఎవరు మాయమాటలతో మోసగిస్తున్నారో గుర్తించి తగినవిదంగా బుద్ధి చెపుతారు,” అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 


Related Post