కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

November 29, 2022


img

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. జనవరిలో సంక్రాంతి పండుగ తర్వాత 18వ తేదీన మంచి ముహూర్తం ఉండటంతో దానినే సిఎం కేసీఆర్‌ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కనుక అప్పటిలోగా సచివాలయ నిర్మాణపనులన్నీ పూర్తి చేయాలని సిఎం కేసీఆర్‌ సచివాలయ నిర్మాణపనులను పర్యవేక్షిస్తున్న మంత్రులను, అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అదే రోజున కొత్త సచివాలయంలోని 6వ అంతస్తులోని సిఎం ఛాంబర్‌లో కేసీఆర్‌ ప్రవేశించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సచివాలయం ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న అమరవీరుల స్తూపాన్ని కూడా ఆదేరోజున సిఎం కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు. 

సిఎం కేసీఆర్‌ ఇటీవలే మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి సచివాలయంలో పర్యటించి అవసరమైన సూచనలు చేశారు. సచివాలయ నిర్మాణపనులు ఇప్పటికే 80%పైగా పూర్తయ్యాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి, మంత్రులు ఛాంబర్లలో ఇంటీరియర్, ఫర్నీచర్, లైటింగ్ తదితర పనులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పనులకు సమాంతరంగా సచివాలయ ఆవరణలో ల్యాండ్ స్కేపింగ్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. కొత్త సచివాలయానికి డా.బిఆర్ అంబేడ్కర్‌ పేరు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.       


Related Post