కారులో షర్మిల ఉండగానే క్రేన్‌తో తరలింపు!

November 29, 2022


img

పంజగుట్ట వద్ద ప్రస్తుతం హైడ్రామా నడుస్తోంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలని కారులో కూర్చొని ఉండగానే పోలీసులు కారుని క్రేన్ సాయంతో ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకొని నిరసనలు తెలియజేయడంతో పంజగుట్ట నుంచి అమీర్ పేట్ చౌరస్తా వరకు భారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. 

ఇంతకీ ఏం జరిగిందంటే ఆమె నిన్న వరంగల్‌ జిల్లా నర్సంపేటలో పాదయాత్ర చేస్తుండగా స్థానిక టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ అనుచరులు ఆమె కారు, కార్వాన్‌పై కర్రలు, రాళ్ళతో దాడి చేశారు. తర్వాత కార్వాన్‌పై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ సందర్భంగా అక్కడ టిఆర్ఎస్‌, వైఎస్ షర్మిల అనుచరుల మద్య తీవ్ర ఘర్షణ జరిగింది. పోలీసులు ఆమెను, అనుచరులను అరెస్ట్ చేశారు.

ఈ దాడిపై నిరసన తెలిపేందుకు టిఆర్ఎస్‌ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన ఆ కారుని వైఎస్ షర్మిల స్వయంగా నడుపుతూ పార్టీ అనుచరులతో కలిసి ప్రగతి భవన్‌ ముట్టడికి బయలుదేరారు. దారిలో రాజ్ భవన్ రోడ్డులో పోలీసులు ఆమెను అడ్డుకొన్నారు. ఆమెను కారులో నుంచి బయటకు రావాలని పోలీసులు ఎంతగా కోరినప్పటికీ బయటకు రాకుండా కారు డోర్స్ లాక్ చేసుకొని లోపలే కూర్చోన్నారు. దాంతో పోలీసులు ఆమె కారులో కూర్చొని ఉండగానే క్రేన్ సాయంతో పైకిలేపి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

వారి వెనుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు తరలివచ్చి పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అడ్డుకొనే ప్రయత్నం చేస్తుండటంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. చివరికి ఆమెను కారుతో సహా పోలీస్ స్టేషన్‌కి తీసుకువచ్చిన తర్వాత కూడా ఆమె కారులో నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరించడంతో మహిళా పోలీసులు లోనికి ప్రవేశించి ఆమెను బలవంతంగా కారులో నుంచి బయటకు తీసుకువచ్చి ఆమెపై కేసు నమోదు చేశారు. 


Related Post