బండి కదలొచ్చు… కానీ భైంసాలోకి నో ఎంట్రీ!

November 28, 2022


img

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈరోజు నిర్మల్ జిల్లా భైంసా నుంచి మహా సంగ్రామయాత్ర ప్రారంభించాలనుకొంటే, పోలీసులు అనుమతి నిరాకరించి గృహనిర్బందంలో ఉంచారు. ఊహించినట్లుగానే బిజెపి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ వేసి పాదయాత్రకి అనుమతి కోరింది. బండి సంజయ్‌ పాదయాత్ర భైంసా పట్టణంలోకి ప్రవేశించకుండా ముందుకు సాగుతుందని, బిజెపి తరపు న్యాయవాది రామచంద్ర రావు హామీ ఇవ్వడంతో హైకోర్టు షరతులతో అనుమతించింది. బండి సంజయ్‌ పాదయాత్రలో 500 మందికి మించకూడదని, ఎవరూ కర్రలు, కత్తులు, రాళ్ళు వంటివి వెంట తీసుకువెళ్ళరాదని ఆదేశించింది. బండి సంజయ్‌ బైంసా పట్టణానికి 3 కిమీ అవతల మధ్ 3 నుంచి సాయంత్రం 5 గంటల లోపు బండి సంజయ్‌ బహిరంగసభ నిర్వహించుకొనేందుకు హైకోర్టు అనుమతించింది. అయితే సభలో ఎవరినీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని, ముఖ్యంగా మత విద్వేషాలు రగిలించేవిదంగా మాట్లాడరాదని హైకోర్టు ఆదేశించింది. 

ఈరోజు బండి సంజయ్‌ భైంసా పట్టణంలో పాదయాత్ర ప్రారంభిస్తూ ముందుగా బహిరంగసభ నిర్వహించాలనుకొన్నారు. కానీ భైంసాలో మాట ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉన్నందున బండి సంజయ్‌కి అనుమతి నిరాకరించి, భైంసా పట్టణంలో భారీగా పోలీసులను మోహరించి  సోమ, మంగళ రెండు రోజులు కర్ఫ్యూ కూడా విధించారు. 

ఈ 5వ విడత మహాసంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్‌ భైంసా నుచి 222 కిమీ పాదయాత్ర చేస్తూ డిసెంబర్‌ 17వ తేదీన  కరీంనగర్‌లోని ఎస్సార్ నగర్‌లోని కళాశాలలో బహిరంగసభతో ముగించనున్నారు. 


Related Post